Gaddar Awards: కళాకారులకు ప్రభుత్వం తరపున లభించే అత్యున్నత పురస్కారం నంది అవార్డులు. కొన్నేళ్లుగా  ప్రభుత్వాలు ఈ అవార్డులను పక్కన పెట్టేశాయి. దీంతో ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అదే పురస్కారాన్ని పేరు మార్చి ‘గద్దర్ అవార్డ్స్’ (Gaddar Awards) పేరిట ఇకపై కళాకారులకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత టాలీవుడ్ నుంచి సరైన స్పందన రాలేదు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దల నుంచి స్పందన రాలేదని టాలీవుడ్ సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల  ఓ సాహితీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గద్దర్ అవార్డులు ఇవ్వాలని తాను ప్రతిపాదించినా సినీ పరిశ్రమ స్పందించలేదని, తానే స్వయంగా అవార్డులు ఇస్తానన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ జయంతి సందర్భంగా అంటే డిసెంబర్ 9న గద్దర్ అవార్డులను ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని, సినీ పరిశ్రమకు చెందని పెద్దలు ప్రభుత్వంపై దృష్టి పెట్టలేదని రేవంత్ అన్నారు.


దీంతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో పాటు ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరూ స్పందించలేదు. దీంతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. టాలీవుడ్ ఎందుకు ఈ విషయంలో సైలెంట్ గా ఉందన్నారు. ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్‌ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానం సందర్భంగా రేవంత రెడ్డి ఈ కామెంట్స్‌ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్లపై వెంటనే మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా స్పందిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తరపున ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అవార్డుల విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. ఆయన కోరిక మేరకు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని.. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయంపై స్పందిస్తూ.. అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో.. గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ)తో చర్చించామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రకటించాయి. గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీని కోరామని తెలిపాయి. కమిటీ ద్వారా విధి విధానాలను రూపొందించి ఎఫ్‌డీసీ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పుకొచ్చాయి. 


 తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ఇందులో.. ‘‘తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మరింత అభివృద్ధికి తోడ్పడుచున్న ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ముఖ్యమంత్రిగారిని కలిసి ఫిలిం ఇండస్ట్రీకి చెందిన విషయముల గురించి వివరముగా చర్చించిన మీదట ఎన్నో సంవత్సరముల నుండి పెండింగ్‌లో వున్న అవార్డ్స్‌ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ‘‘గద్దర్ అవార్డ్స్’’ పేరు మీద ఇక నుండి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వగలమని తెలియచేయగా ఫిలిం ఇండస్ట్రీ వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్‌కు సంబంధించిన కమిటీ గురించి చర్చించడం జరిగిందని, దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీని నియమించి సదరు విధివిధానాలను తయారు చేసి, ఆ విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌కి అతి త్వరలో అందజేయడం జరుగుతుందని తెలియచేయుచున్నాము..’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.