Telangana Weather Update: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు మెరుపులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పిడుగుల శబ్దానికి బయటకు రావాలనంటే బెదిరిపోతున్నారు. ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అందుకే ప్రజలు సాయంత్రం వేళల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఊదురుగాలులు, ఉరుములు, మెరుపులతో గాలి వాన ఇబ్బంది పెడుతోంది. వడగళ్లు పంటలను నాశనం చేస్తున్నాయి. పడిన వర్షం వల్ల ప్రయోజనం లేకపోగా ఉన్న పంటలు నాశనం అవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
తెలంగాణలో పగలంతా ఎండలు నిప్పుల వాన కురిపిస్తోంది. సాయంత్రానికి వెండి మబ్బులు పిడుగుల వర్షంతో బెంబేలెత్తిస్తోంది. శుక్రవారం, శనివారం ఇదే వరస. మంచిర్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గాలి వానబీభత్సం చేసింది. హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల్లో పడిన వర్షం జనాలను పరుగులు పెట్టించింది. అసలే ఆఫీస్‌లు ముగించుకొని ఇంటికి వెళ్తున్న టైంలో పడిన గాలి వానకు జనం ఇబ్బంది పడ్డారు.
శుక్రవారం సాయంత్రం మొదలైన వాతావరణ మార్పులు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. ఆదివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సాయంత్రం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఎత్తైన చెట్లు కింద ఉండొద్దని సూచిస్తున్నారు.
జిల్లాల్లో కురుస్తున్న వడగళ్ల వాన రైతులకు కడగళ్లు మిగులుస్తుంది. మొక్కజొన్న, జీడిమామిడి, పనస లాంటి ఉద్యానవన పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మారిన వాతావరణం, కురిసిన వానలతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. అయితే సోమవారం నుంచి ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు:- నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసి అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత
హైదరాబాద్‌లో ఆదివారం ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. గరిష్ట 34 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఉపరితల గాలులు నైఋతి దిశలో గంటకు 04-08 కి.మీ వేగంతో వీచే ఛాన్స్ ఉంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 34.6డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలు నమోదు అయింది.
ఐపీఎల్ మ్యాచ్‌కు ఆటంకం తప్పదా?
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, రాజస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకింగా మారే అవకాశం ఉందని స్వల్ప ఆటంకం కలగవచ్చు. మ్యాచ్ టైంలో ఈదురుగాలులు వీస్తే మాత్రం కాసేపు బ్రేక్ పడే అవకాశం లేకపోలేదు.