JAC Meeting on Delimitation : డీలిమిటేషన్‌పై నెక్స్ట్‌ మీటింగ్ హైదరాబాద్‌లోనే! రేవంత్ రెడ్డి అభ్యర్థనకు స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ 

JAC Meeting on Delimitation : నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా జేఏసీ తర్వాత సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. చెన్నైలో జరిగిన తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Continues below advertisement

JAC Meeting on Delimitation : దక్షిణాదికి అన్యాయం జరిగే నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణపై యుద్ధం ప్రకటించిన బీజేపీయేతర పార్టీలు ఇవాళ(22మార్చి 2025) చెన్నైలో సమావేశమయ్యాయి. ఇప్పుడు వచ్చే మీటింగ్‌పై కూడా క్లారిటీ వచ్చేసింది. హైదరాబాద్‌లో రెండో జేఏసీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. 

Continues below advertisement

చెన్నైలో జరిగే మీటింగ్‌ అన్ని పార్టీల అధినేతలకు, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు రాశారు. అంతేకాకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వివిధ పార్టీల అగ్రనేతలతో సమావేశమై మీటింగ్‌కు ఆహ్వానించారు. 

అనుకున్నట్టు ఈ మీటింగ్‌కు ఒకట్రెండు పార్టీలు మినహా అందరూ హాజరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించే పార్టీలన్నీ హాజరయ్యాయి. ఏడు కీలక తీర్మానాలను పార్టీలు ఆమోదించాయి. పాతికేళ్లపాటు డీలిమిటేషన్ ప్రక్రియను ఆపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. న్యాయస్థానాల్లో కూడా ప్రక్రియను సవాల్ చేసేందుకు వ్యూహం రెడీ చేయాలని డిసైడ్ చేశాయి. 
చెన్నైలో జరిగిన మీటింగ్ సందర్భంగా రెండో మీటింగ్ ఎక్కడ పడ్డాలనే విషయం చర్చ జరిగింది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ రాష్ట్రంలో పెట్టాలని రిక్వస్ట్ పెట్టారు. హైదరాబాద్‌లో రెండో మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు. దీనికి స్టాలిన్‌తోపాటు మిగతా పార్టీల నేతలు కూడా ఓకే చెప్పారు. 

ఈ విషయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశంలో పాల్గొన్న తర్వాత, కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ ANIతో మాట్లాడుతూ, "డీలిమిటేషన్ సమావేశం చాలా బాగా జరిగింది. ఇది మంచి ప్రారంభం.  దేశ సమాఖ్య నిర్మాణం, రాజ్యాంగాన్ని కాపాడటానికి అందరం చేతులు కలిపాం. తెలంగాణ ముఖ్యమంత్రి (వచ్చే సమావేశానికి ) ఆహ్వానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి దానికి అంగీకరించారు." అని పేర్కొన్నారు. 

డీలిమిటేషన్‌పై తర్వాత సమావేశం ఎప్పుడు ఉంటుంది?
చెన్నై సమావేశం విజయవంతం అయిందని పార్టీలు ప్రకటించాయి. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాలు నష్టపోనున్నాయనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. అందుకే ఈ పోరాటంలోకి ఉత్తరాది పార్టీలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. వాటిని కలుపుకొని వెళ్లే ఆలోచన ఉన్నందు వారితో ప్రాథమికంగా చర్చించి ఈసారి సమావేశానికి ఆహ్వానించనున్నారు. అన్ని పార్టీలు, ముఖ్యమంత్రులు, ఇతర అగ్రనేతల వీలును చూసుకొని వచ్చే రెండునెలల్లో ఏదో రోజు పెట్టవచ్చని తెలుస్తోంది. 

డీలిమిటేషన్‌పై తర్వాత సమావేశానికి వైసీపీ కలిసి వస్తుందా?
స్టాలిన్ లీడ్ తీసుకున్న చెన్నై సమావేశానికి అన్ని పార్టీలతోపాటు వైసీపీని కూడా పిలిచారు. కానీ వైసీపీ గైర్హాజరైంది. సమావేశం జరుగుతున్న టైంలోనే ప్రధానమంత్రి మోదీకి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఎవరికీ అన్యాయం చేయకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని అభ్యర్థించారు. తాను ఇలాంటి సమావేశాలకు రాబోను అని చెప్పకనే చెప్పేశారు. కానీ డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ... జగన్ తమతోనే ఉన్నారని చెప్పారు. వచ్చే సమావేశానికి కచ్చితంగా వైసీపీ వస్తుందని మీడియాకు తెలిపారు. మరి హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి వైసీపీ హాజరవుతుందా అనే ఆసక్తి నెలకొంది. 

సమావేశానికి హాజరుకాలేదు: జనసేన

చెన్నై సమావేశానికి జనసేన హాజరైందన్న ఆరోపణలు ఆ పార్టీ ఖండించింది. డీఎంకే నుంచి ఆహ్వానం అందిందని అయితే తాము హాజరుకాలేమని సమాచారం కూడా ఆ పార్టీకి పంపించినట్టు జనసేన ప్రకటించింది. సమావేశానికి హాజరైనట్టు జరుగుతున్‌న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేసింది. 

Continues below advertisement