Telangana Weather: హైదరాబాద్‌లో వాతావణం చల్లగా మారింది. పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో పలు జిల్లాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఐఎండీ చెప్పినట్టు హైదరాబాద్‌సహా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్‌, వికారాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కొన్ని రోజుల నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్న భానుడు   ఇవాళ మధ్యాహ్నం నుంచి శాంతించాడు. తెలంంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడుతున్నాయి.  వాతావరణ శాఖ ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇవాళే కాకుండా రాబోయే రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖాదికారులు చెబుతున్నారు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతోపాటు గాలి కూడా వీస్తుందని చెప్పారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతా వీస్తాయని తెలిపారు. వడగళ్లు కూడా పడతాయని అంటున్నారు. 

చత్తీస్​గఢ్, మహారాష్ట్ర మీదుగా ఏర్పడిన ఆవర్తనం, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు మీదుగా మరో ఆవర్తనం కలిసి రాష్ట్రంలో ఈ వాతావరణం ఉందని  అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలపాటు తగ్గతుందని వెల్లడించారు. 

మారుతున్న వాతవరణంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజులు కురిసిన వానకు చాలా వరకు పంటలకు నష్టం వాటిల్లింది. వారం పదిరోజుల వ్యవధిలోనే మళ్లీ వర్షాలు అంటే వణికిపోతున్నారు. గాలివానలు, వడగళ్లకు ఉద్యానవన పంటలకు భారీగా నష్టం కలిగింది. ఇప్పుడు ఇది మరింత నష్టాన్ని మిగులుస్తుందని అన్నారు. 

హైదరాబాద్​ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షానికి రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని  సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల పై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ స‌మ‌స్య‌, విద్యుత్ అంత‌రాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన ప్రాంతాల్లో  వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో జ‌ల‌మ‌య‌మైన కాల‌నీల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌ను వీలైనంత త్వ‌ర‌గా క్లియ‌ర్ చేసి వాహ‌న‌దారులు త్వ‌ర‌గా ఇళ్ల‌కు చేరుకునేలా చూడాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు.

వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది చేప‌ట్టే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగ‌స్వాములు కావాల‌ని ఆదేశించారు. జిల్లాల్లో కూడా వర్షాలు,  ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు