Hyderabad Auto Rickshaw: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్. కొత్త ఆటోల కొనుగోలుపై ఆంక్షలను ఇటీవల ఎత్తేసిన ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. మాఫియాకు అడ్డుకట్టవేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. సిండికేట్‌లకు అవకాశం లేకుండా రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. అవుటర్‌ రింగ్‌రోడ్‌ పరిధిలోపు ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. 

ఈ మధ్యనే ప్రభఉత్వం 65 వేల ఆటో పర్మిట్‌లకు ఓకే చెప్పింది ప్రభుత్వం. ఇందులో ఎలక్ట్రిక్‌ ఆటోలు 20 వేలు ఉంటే 10 వేల ఎల్పీజీ, మరో 10 వేలు సీఎన్‌జీ పర్మిట్‌లు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న ఎల్పీజీ, డీజిల్, పెట్రోల్‌ ఆటోలకు మార్పులు చేర్పులు చేసుకొని ఎలక్ట్రిక్‌గా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఈ పర్మిట్‌లు ఎవరికి ఇవ్వాలనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జీవో 263కి అనుగుణంగా ఈ రూల్స్‌ను రూపొందించారు. 

హైదరాబాద్‌లో పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఆదివారం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది రవాణాశాఖ. తెలంగాణలోని ఏ డీలర్ వద్దైనా సరే ఎల్‌పీజీ, సీఎన్‌జీ, ఎలక్ర్టిక్‌ ఆటోలు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే హైదరాబాద్‌లో ఆ ఆటో తిప్పాలనుకునే వారు మాత్రమ లోకల్‌గా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓఆర్‌ఆర్‌లోపు అడ్రెస్‌ ప్రూఫ్‌ ఉండాలని స్పష్టం చేసింది. 

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్టు కచ్చితంగా ప్రూఫ్‌లు ఇవ్వాలి. కొనుగోలుదారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడా లేదా అనేది తేల్చాల్సిన బాధ్యత పూర్తిగా డీలర్లకే విడిచిపెట్టారు. వాహనం కొనుగోలు చేసినప్పుడు సదరు వ్యక్తి ఆటో లేదా కారు డ్రైవింగ్‌ లైసెన్స్, ఆధార్, పుట్టిన తేదీ, ఔటర్‌ పరిధిలో ఉంటున్నట్టు రెండు అడ్రస్‌ డాక్యుమెంట్స్‌ ఇవ్వాలి. ఆ తర్వాత వాహనం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతోంది. 

వాహనం కొనుగోలుదారు ఇచ్చిన వివరాలు సరిగా ఉంటే ప్రక్రియను ప్రారంభించి వాటిని సదరు డీలర్లు సీఎఫ్‌ఎస్‌టీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఎంటర్ చేయాలి. ఆ వివరాలను ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తారు. 24 గంటల్లోనే దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి ఇచ్చిన వివరాలు సరైనో కావో నిర్దారించుకున్న తర్వాతే వాహనం కొనుగోలు ప్రక్రియ ముందుకెళ్తుంది. ఒకసారి ఆర్టీఏ అధికారులు సదరు వ్యక్తి వివరాలు నిర్దారించిన తర్వాత డ్రైవర్లు వాహనం కొనుగోలు చేయాలి. ఈ కొనుగోలు కూడా 60 రోజుల్లో పూర్తి చేయాలి. 

ఆర్టీఏ అధికారుల నుంచి అనుమతులు వచ్చిన 60రోజులు అంటే రెండు నెలలోపు ఆటో కొనుగోలు చేయకుంటే ఆ అనుమతులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. పర్మిట్లకు ఉన్న డిమాండ్‌ దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పాత ఆటో పర్మిట్ ఉందని దాని స్థానంలో కొత్త ఆటో కొనేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. 

ఈ పర్మిట్‌ల ప్రక్రియ సజావుగా సాగేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేశారు. ఆటో కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్స్‌ అడ్రెస్‌తోపాటు మరో అడ్రెస్ ప్రూఫ్‌ ఏదైనా చూపించాలి. ఇలా చూపించి పర్మిషన్ తీసుకున్న వ్యక్తులకు ఒకరికి ఒక ఆటో పర్మిషన్ మాత్రమే ఇస్తారు. గతంలో ఆ వ్యక్తి పేరుపై ఆటో రిక్షాలు ఉంటే మాత్రం అనర్హులుగా ప్రకటిస్తారు. తన పేరు మీద ఎలాంటి ఆటో పర్మిషన్ లేదని అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. 

నిరుపేదలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కువ మంది లబ్ధిపొందాలని ప్రభుత్వం చూస్తోంది. ముందుగా వచ్చిన వాళ్లకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డీలర్లు కూడా ఆర్టీఏ అనుమతులు వచ్చిన వారికే ఆటోలు అమ్మాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించాలి. ప్రాసెసింగ్ పేరుతో , ఇతర సర్వీసుల పేరుతో డబ్బులు వసూలు చేయడం నేరం అవుతుంది. బ్లాక్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి ఒక్క ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది.  

పర్మిట్‌లను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్న ఫైనాన్షియర్‌లు కాసులు దండుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంతో కొంత వరకు మార్పు వచ్చే అవకాశం ఉందని ఆటో డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉన్న పర్మిట్‌లు చూపించే కొత్త ఆటోలు కొనుగోలు చేస్తున్నారు. దీనికి కూడా ప్రభుత్వం నో చెప్పడం అక్రమ వ్యాపారనికి అడ్డుకట్టపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.