హైదరాబాద్: కన్నెపల్లి పంప్ హౌజ్, కల్వకుర్తి ప్రాజెక్టుల వద్ద మోటర్లు ఆన్ చేయకపోతే కేసీఆర్ నాయకత్వంలో వేలాదిమంది రైతులతో ప్రాజెక్టు వద్దకి వెళ్లి మోటర్లు ఆన్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) హెచ్చరించారు. పొరుగున కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడుతున్నా.. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రైతులు విత్తనాలు వేసే పరిస్థితి లేదు. విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదన్నారు.
చెక్ డ్యాములు నింపకుండా చోద్యం చూస్తున్న ప్రభుత్వం
తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ‘భూగర్భ జలాలు రోజురోజుకీ అడుగంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు పలు జిల్లాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు కురవడం వల్ల కృష్ణ, గోదావరి నదుల్లో మే నెలలోనే వరదలు వచ్చాయి. రిజర్వాయర్లు , చెరువులు, చెక్ డ్యాములు నింపుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. జులై, ఆగస్టులో రావలసిన వరదలు మేలోనే వచ్చాయి. కృష్ణ, గోదావరి వరద నీళ్లను ఒడిసి పట్టుకుంటే 2 పంటలకు నీరందించే అవకాశం ఉంది. మోటర్లు ఆన్ చేసి ప్రాజెక్టుల నుంచి రిజర్వాయర్లు, చెక్ డాములు, చెరువులు నింపుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బీఆర్ఎస్ పై బురద జల్లడంలో పోటీపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ మీద కక్షతోని కడుపుమంటతోనే కాదనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. మాపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దు. నీళ్ల విలువ తెలియని వాళ్లు పాలకులుగా ఉండటం వల్ల తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నదిలో ఎంత నీళ్లు వస్తున్నాయని చూసి అధికారులను, నాయకులను అప్రమత్తం చేసేవారు. జూరాలలో వరదొస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులకు, ఇంజనీర్లకు ఫోన్లు చేసి మోటర్ల ఆన్ చేసి నీళ్లను నింపుకోవాలని చెప్పేవారు. వరద వచ్చి నెల రోజులు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లను ప్రారంభించలేదు.
ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి ?
మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరచి ఉన్నా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉందని ఇంజనీర్లే చెప్తున్నారు. నది లేకున్నా రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇలా దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను నిర్మించాం. పంప్ హౌస్ లు, సబ్ స్టేషన్లు ఉన్నా నీళ్లు ఎత్తుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి ?
మేడిగడ్డ దగ్గర ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ (MDDL) 93.5 మీటర్లు. నది ప్రవాహంలో ఎత్తు 73600 క్యూసెక్కుల నీళ్లు పోతే నది 96 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎండీడీఎల్ కంటే రెండున్నర మీటర్లు ఎత్తులో నీళ్లు పోతున్నా ఎందుకు మోటర్ ఆన్ చేయడం లేదు. ఒక్కొక్క మోటారు 2100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. మేడిగడ్డ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా రోజుకి రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పర్ఫెక్ట్ గా ఉన్నాయని ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. పంప్ హౌస్ లక్షణంగా పనిచేస్తున్నది. బటన్ నొక్కితే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. రైతులు పంప్ హౌస్ లు ప్రారంభించాలని ఫోన్లు చేస్తున్నారు. ఎస్సార్ఎస్పీలో 18 టీఎంసీల నీళ్లు లేవు. ఎస్సారెస్పీ కింద 14లక్షలు, మిడ్ మానేరు కింద లక్ష ఎకరాలు, కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. కాళేశ్వరం మోటర్లు ప్రారంభిస్తే 15 జిల్లాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది.
ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ వరకు ఎస్సారెస్పీ స్టేజి 2 కింద నీళ్లు ఇవ్వొచ్చు. మొదటి పంటకు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజాంబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. వెంటనే కాళేశ్వరం మోటర్లు ప్రారంభించి రిజర్వాయర్లు నింపి రైతులకు మొదటి పంటకు నీళ్లు ఇవ్వాలి. లేకపోతే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులం కలిసి కన్నెపల్లికి వెళ్లి మోటర్లు ఆన్ మోటర్లు ప్రారంభించి నీళ్లిచ్చి చూపిస్తాం.
కాళేశ్వరం అంటే 100 భాగాలు. 100 భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం. 80 పిల్లర్లలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. 19 రిజర్వాయర్లు, 21 పంపు హౌస్ లు, 16 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెలు, 1531 కి.మీ గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం. మేడిగడ్డకి మరమ్మత్తులు చేయాలి. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించి నీళ్లు ఎత్తిపోయాలి.
పోలవరం విషయంలో ఎందుకు స్పందిచలేదు పోలవరం డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. గేట్ వాల్ కొట్టుకుపోయింది. 2000 కోట్ల రూపాయల నష్టం జరిగినా ఎందుకు ఎన్డీఎస్ఏ స్పందించలేదు. ఐదు రోజుల్లో తెలంగాణకు వచ్చి నివేదికలు ఇస్తారు కానీ 5 సంవత్సరాలైనా పోలవరం విషయంలో స్పందించరు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బంధానికి ఇది నిదర్శనం.. పోలవరంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే కొత్త డయా ఫ్రమ్ వాల్ కడుతున్నారు. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు’ అని హరీష్ రావు విమర్శించారు.