టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బెయిల్ మీద శుక్రవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పై చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. వరంగల్ సీపీపై బండి సంజయ్ వ్యక్తిగత దూషణ చేయడం సరికాదు అన్నారు సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి. సీపీ మీద చేసిన మీ వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ ను డిమాండ్ చేశారు. ఏ పోలీసు ఉద్యోగి ఏ కేసులోనూ ప్రత్యేకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు అన్నారు. తాము విధుల్లో చేరేటప్పుడే నిజాయితీతో, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవచేస్తామని ప్రతిజ్ఞ చేస్తామన్నారు. అలాంటిది వరంగల్ సీపీ రంగనాథ్ ను ప్రమాణం చేయమని బండి సంజయ్ అడగడం అసంబద్ధమైన విషయం అన్నారు.


వరంగల్ సీపీ పనితీరు గురించి తెలియాలంటే గతంలో ఆయన పనిచేసిన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని సామాన్య ప్రజానీకాన్ని అడిగినా తెలుస్తుందన్నారు. లేదంటే ఆయా జిల్లాల్లోని మీ పార్టీ కార్యకర్తలను అడిగినా వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సామాన్య ప్రజానీకం సమస్యలను రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా పరిష్కరిస్తున్న తీరు యావత్ రాష్ట్రం గమనిస్తుందని పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. సమస్యల నుండి విముక్తి అయిన ప్రజలు పోలీసులకు, పోలీసు వ్యవస్థకు పాలాభిషేకాలతో బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తమకు పోలీసులపై ఉన్న విశ్వాసాన్ని ప్రజలు ప్రకటిస్తున్నారు. సీపీ రంగనాథ్ తన కెరీర్ లో ఎన్నో ముఖ్యమైన, సంచలనాత్మకమైన కేసులను పరిష్కరించిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసునన్నారు.


టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి బండి సంజయ్ కు, బీజేపీ నేతలకు ఏమైనా సందేహాలను విచారణలో భాగంగా నివృత్తి కోరవచ్చు అన్నారు. అందులో భాగంగా పోలీసు వ్యవస్థ అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తుంది. ఈ కేసుకు సంబంధించిన బండి సంజయ్ అభ్యంతరాలను న్యాయస్థానాల్లో తేల్చుకోవాలిగాని చట్టబద్దంగాని ప్రమాణాలను చేయమని కోరడం అశాస్త్రీయం, అసంబద్ధం అని పోలీసులు మండిపడ్డారు. పోలీసు అధికారులు, సిబ్బంది విశ్వసనీయతను ప్రశ్నించే మీ వైఖరిని మార్చుకోవాలని, కమిషనర్ మీద చేసిన మీ వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తరఫున అధ్యక్షుడు వై గోపిరెడ్డి డిమాండ్ చేశారు.


రాత్రి బెయిల్, ఉదయం జైలు నుంచి విడుదల 
పేపర్ లీకేజీ కేసులో హన్మకొండ కోర్టు బండి సంజయ్ కు గురువారం అర్థరాత్రి బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఉదయం ఫస్ట్‌ అవర్‌లో ప్రక్రియను పూర్తి చేసిన బీజేపీ లీగల్‌ సెల్‌ బండి సంజయ్‌ను బయటకు తీసుకొచ్చింది. గురువారం మధ్యాహ్నం నుంచి 8 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఇద్దరు వ్యక్తుల హామీ, రూ.20 వేల పూచీకత్తుతో హన్మకొండ కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. టెన్త్ పేపర్ లీక్  కేసు రిమాండ్ రిపోర్టులో బండి సంజ‌య్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మ‌హేశ్‌, ఏ4గా మైన‌ర్ బాలుడు, ఏ5గా మోతం శివ‌గ‌ణేశ్‌, ఏ6గా పోగు సురేశ్‌, ఏ7గా పోగు శ‌శాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోత‌బోయిన వ‌సంత్ పేర్లను చేర్చారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, చాలామందికి పంపారని వరంగల్‌ సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు.