Telangana Doorstep FIR: సాధారణంగా ఒక నేరం జరిగినప్పుడు బాధితులకు ఎదురయ్యే అతి సవాల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం. అక్కడి వాతావరణం, విచారణలు, ఎదురు చూపులు బాధితులకు మరింత మానసిక వేదనను కలిగిస్తాయి. కానీ ఇకపై ఆ భయం అవసరం లేదంటున్నారు తెలంగాణ పోలీసులు. బాధితుల దగ్గరికే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించేలా తెలంగాణ పోలీసు శాఖ ఒక సంచలన మార్పునకు శ్రీకారం చుట్టింది. బాధితులే కేంద్రంగా సాగే విక్టిమ్‌ సిటిజన్ సెంట్రిక్‌ విధానాన్ని హైదరాబాద్‌లో పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 

Continues below advertisement

తెలంగాణ సీఐడీ రూపొందించిన ఈ నూతన మార్గదర్శకాలు, పోలీసింగ్ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి. ప్రజలకు, పోలీసులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, న్యాయం అందించడంలో జాప్యాన్ని నివారించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 

ఇంటికొచ్చి ఎఫ్‌ఐఆర్ నమోదు 

ఈ నూతన విధానం ప్రకారం ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్‌కు పరుగుల తీయాల్సిన అవసరం లేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని ఫిర్యాదు స్వీకరిస్తారు. ఒక వేళ బాధితులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టైతే అధికారులు నేరుగా ఆసుపత్రికే వెళ్లి అక్కడ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి, మహిళలకు, వృద్ధులకు పెద్ద ఉపశమనం లభించనుంది. బాధితుల గౌరవానికి ఎలాంటి భంగం కలగుండా, వారి గోప్యతను కాపాడుతూ సేవలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. 

Continues below advertisement

ఏయే కేసుల్లో ఈ విధానం వర్తిస్తుంది?

ప్రభుత్వం, సీఐడీ సంయుక్తంగా రూపొందించిన ఈ విధానం కేవలం కొన్ని రకాల నేరాలకు మాత్రమే పరిమితం కాలేదు. దీని పరిధిలోకి ప్రధానంగా చాలా అంశాలు వస్తాయి. రోడ్డు ప్రమాదాలు, అకాల మరణాల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా చూడటం దీని ముఖ్య ఉద్దేశం. మహిళలు, పిల్లలపై నేరాలు జరిగితే వారి గోప్యత చాలా ముఖ్యం. అందుకే వారి ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరిస్తారు. వాహనాల చోరీలు, ఇళ్లల్లో దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు ఇంటికే వస్తారు. విద్యాసంస్థల్లో జరిగే ర్యాగింగ్‌ బాధితులు, ఆత్మహత్యలపై సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తారు. 

ఈ విప్లవాత్మక మార్పు కేవలం కాగితాలే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు కావాలని సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ఈ విధానాన్ని పర్యవేక్షించే బాధ్యతను ఉన్నత స్థాయి అధికారులకు అప్పగించారు. ప్రతి కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. 

నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులను అకారణంగా లేదా చిన్న చిన్న కారణాలతో పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తే, దానికి సంబంధించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ లేదా సంబంధిత అధికారులదే పూర్తి బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

సైబర్ నేరాలకు సీ మిత్ర అండ 

ఇప్పటికే సైబర్ నేరాలు నియంత్రణ కోసం తెలంగాణ పోలీసులు సీ మిత్ర అనే  ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు.  ఇప్పుడు మరో విధానం అమలు చేస్తోంది. ఒక వేళ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించినా లేదా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం వహించినా ప్రజలు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇందు కోసం హైదరాబాద్ పోలీసు ఒక ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ (9490616555)ను అందుబాటులోకి తీసుకొచ్చింది.