తెలంగాణలో బియ్యం అమ్మకాల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశారు పీసీసీ చీఫ్. 


ఇప్పటికే దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించి FCI విచారణకు అదేశించారు. ఒకట్రెండు రోజుల్లో ఫుడ్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా అధికారులు రంగంలోకి దిగనున్నారు. అక్రమాలు జరిగాయని కేంద్రమే అంగీకరిస్తున్నందున సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. 


ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్లకు రాసిన లేఖలో రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రబీ సమయంలో కేసీఆర్ తీసుకున్న అనిశ్చిత నిర్ణయాల వల్ల రైతులు చాలా నష్టపోయారని అన్నారు. ఈ కారణంలో మధ్యవర్తులు భారీగా దోచుకున్నారని ఆరోపించారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రబీ సమయంలో స్పష్టమైన వైఖరి చెప్పలేకపోయిందన్నారు రేవంత్‌. అనిశ్చితి, గందరగోళం దాదాపు 35 శాతం నుంచి 40 శాతం మంది రైతులు తీవ్రంగ నష్టపోయినట్టు పేర్కన్నారు. దోపిడీకి గురయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం కొనుగోలు చేయబోదన్న భయంతో అన్నదాతలు తమ పంటను మధ్య దళారులకు, మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన సమస్య కారణంగా తెలంగాణ రైతులకు రూ. 3000-4000 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు రేవంత్ రెడ్డి. ఇది సీఎం కేసీఆర్ బాధ్యతారహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని హితవు పలికారు రేవంత్‌.


గందరగోళం సృష్టించిన ప్రభుత్వం ఆ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాల్సిందన్నారు రేవంత్. ప్రత్యామ్నాయ పంటలకు కనీసం మద్దతు ధర ప్రకటించి ఉన్నా కొంత లాభం జరిగేదన్నారు. ఇలాంటి ముందస్తు ఆలోచన లేకుండా కేసిఆర్‌ తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు.


తెలంగాణలో రైస్ మిల్లర్లు ఎఫ్‌సీఐ నుంచి ధాన్యం తీస్కొని బియ్యం ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయాలు తెలంగాణ  ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎఫ్.సి.ఐ బియ్యం విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేక అనుమానాలు లేవనెత్తారని వెల్లడించారు. ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యం నల్ల బజారుకు తరలించారా.. విదేశాలకు అమ్మకున్నారని కూడా కిషన్ రెడ్డి  ప్రశ్నించిన సంగతిని గుర్తు చేశారు రేవంత్‌. 


స్వయంగా కేంద్రమంత్రి ఇంతటి ఆరోపణలు చేసి.. ఇప్పుడు ఎఫ్‌సీఐ ఎంక్వయిరీకి ఆదేశించినప్పుడు సీబీఐతో ఎందుకు విచారించరని ప్రశ్నించారు రేవంత్‌ రెడ్డి. వెంటనే సీబీఐ విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2022 మార్చి 28 నాటి విచారణలో రైస్ మిల్లులలో సుమారుగా వేల మెట్రిక్ టన్నులు ఎఫ్.సి.ఐ బియ్యం లేకుండా పోయాయని ఇంతటి పెద్ద స్కామ్‌లో చిన్న చిన్న సంస్థల విచారణలో ప్రయోజనం ఉండకవచ్చన్ననారు.