Telangana Assembly Sessions : హైదరాబాద్: డిసెంబర్ 11 నుంచి జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్ పై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ్యుల ఓరియెంటేషన్ సెషన్ బహిష్కరించాలని బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరించారని తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారు. బీఆర్ఎస్ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కేలా వ్యవహరించారు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్తవాళ్లు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా బుధవారం నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికైనా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
చుట్టాల పెండ్లి కోసం సభ వాయిదా
చుట్టాల పెండ్లికోసం చట్టసభలు వాయిదానా ? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం నవ్వులపాలు అవుతోందని బీఆర్ఎస్ అంటోంది. డిసెంబరు 9 నుండి శాసనసభ సమావేశాలు అని గొప్పగా ప్రకటించి పెండ్లి కోసం సభలను వాయిదా వేస్తారా ?! చట్టసభలకు ఇచ్చే గౌరవం ఇదేనా ? అని ప్రశ్నించారు. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్న సభలను కేవలం సీఎం ఒక్కరి కోసం వాయిదా వేస్తారా ?. అయినా తెలంగాణ అస్థిత్వాన్ని గౌరవించలేనోళ్లు ఇక చట్టసభలను ఏం గౌరవిస్తారు అని ఎద్దేవా చేశారు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందన్నట్లుగా, ఏడాది కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఎక్కే విమానం .. దిగే విమానం అన్నట్లు మారిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ గమనిస్తుంది, తెలంగాణ సమాధానం ఇస్తుందన్నారు.
ఆశా కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
కాంగ్రెస్ సర్కార్‌కు సంవత్సరం పూర్తయిన సందర్భంగా తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడగడానికి వస్తే ఆడబిడ్డలని చూడకుండా నడిరోడ్డు మీద మగ పోలీసులతో దాడి చేయించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి లాంటి కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకు సేవలందించిన ఆశా వర్కర్లపై కాంగ్రెస్ సర్కార్ దమన కాండను చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయిందన్నారు.
నిన్న పోలీసుల దాడిలో గాయపడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్ల (Asha Workers)ను కేటీఆర్ పరామర్శించారు. వారి పోరాటానికి మద్దతు తెలిపి, ధైర్యం చెప్పారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, తదితరులు ఉన్నారు.