Cyber Crime in Hyderabad | హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు పలువురు తెలంగాణ మంత్రుల వాట్సాప్, మీడియా గ్రూప్‌లను హ్యాక్ చేసినట్లు సమాచారం. హ్యాక్ చేసిన అనంతరం, వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరును వాడుకుంటూ, ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని సూచిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ మెసేజ్‌లలో భాగంగా ప్రమాదకరమైన ఏపీకే (APK) ఫైల్స్‌ను షేర్ చేస్తున్నారు. అందువల్ల, ఈ APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంత్రుల ఫోన్లతో పాటు మీడియా గ్రూపులు, సామాన్యుల ఫోన్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోతో అప్డేట్ చేసి కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. గ్రూప్ పేరుతో పాటు ఆ వ్యక్తుల పర్సనల్ వాట్సాప్ అకౌంట్ పేరు వివరాలను ఎస్బీఐ వివరాలతో మార్చి వారి ఫ్రెండ్స్ ను ఏమార్చే ప్రయత్నం జరుగుతోంది.
ఆ ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయవద్దు
వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు మీ స్టేట్ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ అప్డేట్ చేయలేదనో, ఈ కేవైసీ చేయలేదని.. మీ బ్యాంక్ అకౌంట్ ఈరోజు రాత్రి నుంచి పర్మినెంట్ గా బ్లాక్ అవుతుందని ప్రజలను భయపెడుతున్నారు. ఏపీకే ఫైల్ సెండ్ చేసి నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తున్నారు. అయితే ఎవరూ ఇలాంటి మెస్సేజ్ లలో వచ్చిన లింక్స్, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని, డౌన్ లోడ్ చేయవద్దని అధికారులు, పోలీసులు ప్రజలకు సూచించారు.
అనుమానిత నెంబర్లు, లేక బ్యాంకు నుంచి చేస్తున్నట్లుగా వచ్చే మెస్సేజ్ లను సరిగ్గా గమనించాలి. అంతేకానీ తొందరపడి ఆ లింక్స్ క్లిక్ చేయవద్దు. ముఖ్యంగా అలాంటి సమయంలో బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ యాప్స్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం లాంటివి అసలు చేయవద్దు. డిజిటల్ అరెస్టులతో పాటు సైబర్ నేరగాళ్లు ఆధార్ అప్డేట్, పాన్ అప్డేట్ అంటూ ఈ కేవైసీల పేరుతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసేస్తారు జాగ్రత్త.