Telangana Indiramma Indlu Scheme Latest News: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రక్రియలో ఆలస్యం ఉండకూదని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి అర్హుల జాబితా రెడీ చేయాలని సూచించారు. అప్లై చేసే సరికే అర్హులెవరో ప్రాథమికంగా తేలిపోవాలని ఎక్కువ సమయం తీసుకోవద్దని అధికారులకు మంత్రి సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి రివ్యూ
జనవరి మూడో వారంలో నిర్వహించిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని మంత్రి సూచించారు. సోమవారం నాడు సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రిగారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపి గౌతమ్ పాల్గొన్నారు.
ఎంపికైన వారు ఎదుర్కొన్న సమస్యలపై అధ్యయనం చేయాలని సూచన
ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ..."జనవరి 26వ తేదీన మోడల్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసిన 562 గ్రామాల్లో ఎదురైన పరిస్థితులపై అధ్యయనం చేయాలన్నారు. మంచి చెడులను పరిగణనలోకి తీసుకొని ఇప్పటివరకు ఎదురైన సమస్యలను అంచనా వేయాలన్నారు. వాటిని ఆధారంగా చేసుకొని లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అర్హతగల లబ్దిదారులను గుర్తించడంలో పకడ్బందీగా వ్యవహరించాలి అన్నారు.
టెక్నాలజీని వాడుకోవాలని ఆదేశాలు
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వీలైనంత మేరకు అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నా సరే అనర్హులని తేలితే వాటిని రద్దు చేస్తామని ప్రకటించారు. అందుకే ఎంపిక ప్రక్రియ చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులకు హెచ్చరించారు.
అప్లై చేసినప్పుడే అర్హులను తేల్చాలని ఆదేశం
ఇండ్ల కోసం దరఖాస్తు చేసిన సమయంలోనే లబ్ధిదారుల అర్హతలను నిర్ధారించగలగాలి అని అధికారులకు సూచించారు. దీని వలన సమయంతోపాటు అర్హులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అర్హతలేని వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో చేరకుండా ప్రాథమిక స్ధాయిలోనే గుర్తించాలని తేల్చి చెప్పారు.
అనర్హులు జాబితాలో ఉండకూడదు
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. అర్హులైన వారు ఇండ్లు పొందలేదని ఫిర్యాదులు ఉంటే క్షేత్రస్ధాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇండ్ల మంజూరులో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నాారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిరుపేదలు ఎదురు చూస్తున్నారని వారికి న్యాయం చేయాలన్నారు. వారి ఆశలకు అనుగుణంగా అధికారులు పని చేసి అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలని హితవు పలికారు. పారదర్శకంగా జాబితా తయారు చేయాలని సూచించారు. ఏ దశలోనూ అనర్హులకు మంజూరు చేశామన్న మాటే రాకూడదని పదే పదే నొక్కి చెప్పారు. ఇలాంటి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.