Telangana Meeseva Charges: తెలంగాణ రాష్ట్రంలో పౌర సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు చేరవేసే మీ సేవ కేంద్రాల ఛార్జీల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 15 ఏళ్లుగా ఉన్న పెంపు డిమాండ్‌ను ఇన్ని రోజులు నెరవేర్చారు. ఇప్పుడు పెరిగిన ఛార్జీల ప్రకారం ఏయే సర్టిఫికెట్లకు ఎంత వసూలు చేస్తారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వుల మేరకు, బుధవారం నుంచి అన్ని రకాల పౌరసేవలపై వినియోగ ఛార్జీలు పెరిగాయి. గతంలో కేవలం వినియోగ ఛార్జీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం వీటికి 18 శాతం జీఎస్టీని అదనంగా చేర్చింది.
చార్జీల పెంపు ఎలా ఉందంటే?
మీ సేవలో అందించే సేవలను ప్రధానంగా రెండు కేటగిరీలుగా విభజిస్తారు. కేటగిరి ఏలో ఉండే డాక్యుమెంట్ స్కాన్ లేదా సంబంధిత విభాగాల విచారణ అవసరం లేని సేవలు ఉంటాయి. గతంలో దీనికి 35 రూపాయలు వసూలు చేసే వారు. ఇప్పుడు దీన్ని 62 రూపాయలకు పెంచారు.
కేటగిరి బీలో వివిధ శాఖల విచారణ లేదా పరిశీలిన తర్వాత అందించే సేవలు వస్తాయి. ఈ కేటగిరి కింద అందించే సేవలకు 45 రూపాయలు తీసుకునే వాళ్లు. ఇప్పుడు దాన్ని 80 రూపాయలకు పెంచారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన పెంపు 50శాతమే అయినప్పటికీ జీఎస్టీని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ భారం 77 శాతం నుంచి 78 వరకు పెరుగుతుంది.
ఎవరిపై ఎలాంటి భారం పడుతుంది?
ఈ ధరల పెంపు ముఖ్యంగా సర్టిఫికెట్లు కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లి వారిపై ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు కుల ధ్రువీకరణ పత్రం తీసుకునే వారు కేవలం 45 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ కోసం 80 రూపాయలు చెల్లించాలి. గతంలో దరఖాస్తుతోపాటు నాలుగు కంటే ఎక్కువ పేజీలు స్కాన్ చేయాల్సి వస్తే పేజీకి రెండు రూపాయలు వసూలు చేసే వాళ్లు ఇప్పుడు అది 2.50కు పెంచారు.
మీసేవ నిర్వాహకులకు పెరిగిన కమిషన్
ప్రజలపై భారం వేసిన ప్రభుత్వం మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఊరట కల్పించింది. వారి కమిషన్లు పెంచింది. కేటగిరి ఏలో సేవలకు గతంలో 13 రూపాయల కమీషన్ ఉండేది. దీన్ని ఇప్పుడు 40.34 రూపాయలకు పెంచారు. కేటగిరి బీ సేవలకు 52.10 రూపాయాల కమిషన్ ఇస్తారు.
ఎక్కువ తీసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ప్రభుత్వం నిర్ణయించిన ఈ కొత్త ధరల కంటే మీ సేవ కేంద్రాల నిర్వాహకులు అదనంగా వసూలు చేయడానికి లేదు. అలా ఎవరైనా వసూళ్లకు పాల్పడిదే 1100 లేదా 18004251110 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు లేదా. meesevasupport@telangana.gov.inకు మెయిల్ చేయవచ్చు.
