Kavitha Politics | హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని మరింత యాక్టివ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సైలెంట్ మూమెంట్ మొదలుపెట్టి, క్రమంగా పలు పార్టీల నేతల్ని కలిసి మద్దతు కూడగుతున్నారు కవిత. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంస్థ తెలంగాణ జాగృతికి విదేశాల్లో అధ్యక్షులను ప్రకటించారు. సమాజంలోని అన్ని వర్గాలవారికి చేరువ కావడానికి తెలంగాణ జాగృతి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే విదేశాల్లోనూ తమ శాఖలను పటిష్టం చేసే పనిలో కవిత బిజీగా ఉన్నారు. పలు దేశాలలోని శాఖలతో ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి తెలంగాణ జాగృతి కృషి చేస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు దేశాల తెలంగాణ జాగృతి శాఖలకు నూతన అధ్యక్షులను ఆదివారం (జూన్ 29న) ప్రకటించారు. బాధ్యతలు అప్పగించిన వారు తెలంగాణ అభ్యున్నతికి, ఆయా దేశాలలో ఉన్న తెలంగాణ వాసుల సంక్షేమానికి కృషి చేయాలని ఆమె సూచించారు. అలాగే మహారాష్ట్ర శాఖ అధ్యక్షులుగా శ్రీనివాస్ సుల్గేను ఎమ్మెల్సీ కవిత నియమించారు. తాజా నియామకాలన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని, త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి ఓ ప్రకటనలో తెలిపారు.  

వివిధ దేశాల అధ్యక్షులు, ఇతర నియామకాలు :- న్యూజిలాండ్ అధ్యక్షులు - అరుణ జ్యోతి ముద్దం- గల్ఫ్ అధ్యక్షులు :  చెల్లంశెట్టి హరిప్రసాద్- ఖతర్ అధ్యక్షులు -  మూకల ప్రవీణలక్ష్మి,   -      అడ్వైజర్ - నందిని అబ్బగోని - యూఎఈ అధ్యక్షులు - పీచర వేంకటేశ్వర రావు,  -       ప్రధాన కార్యదర్శి: శేఖర్ గౌడ్  - కువైట్ అధ్యక్షులు - మర్క ప్రమోద్ కుమార్- సౌదీ అరేబియా అధ్యక్షులు - మహమ్మద్ మొజ్జం అలీ ఇఫ్తెకార్ - ఒమన్ అధ్యక్షులు - గుండు రాజేందర్ నేత- యునైటెడ్ కింగ్ డమ్‌ అధ్యక్షులు - సుమన్ రావు బల్మూరి- ఇటలీ అధ్యక్షులు - తానింకి కిశోర్ యాదవ్- ఫిన్లాండ్ - ఐరెడ్డి సందీప్ రెడ్డి - పోర్చుగల్ - ప్రకాశ్ పొన్నకంటి - మాల్టా అధ్యక్షులు - పింటు ఘోష్ - కెన్యా అధ్యక్షులు - స్వప్న రెడ్డి గంట్ల- ఇరాక్ & కుర్దిస్తాన్ - అధ్యక్షులు: మహ్మద్ సల్మాన్ ఖాన్,  - ప్రధాన కార్యదర్శి నాయక్వార్ రాం చందర్

తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో సమీకరణాలు మారిపోయాయి. తన తండ్రిని నేరుగా కలవలేకపోయానని సైతం ఓసారి చెప్పిన కవిత.. తన తండ్రి కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పడం పార్టీలో ప్రకంపనలు రేపింది. దీనిపై మాట్లాడటానికి కేటీఆర్, హరీష్ రావు అంతగా ఇష్టపడలేదు. అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేద్దామని చూడగా అడ్డుకున్నది తానేనని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యల్లో మాత్రం నిజం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేది లేదని కేటీఆర్, హరీష్ రావు స్పష్టం చేశారు.