Hyderabad News: జన్వాడలోని వివాదాస్పద ఫాం హౌస్ కూల్చి వేతకు హైడ్రా (Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency) సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సదరు ఫాం హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని జీవో 111ను ఉల్లంఘించి నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మంగళవారం మధ్యాహ్నం జన్వాడ ఫాం హౌస్ వద్దకు చేరుకున్న ఇరిగేషన్ అధికారులు చుట్టూ పరిశీలించారు. ఈ క్రమంలోనే జన్వాడ ఫాం హౌస్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారన్న ప్రచారం మొదలైంది.




ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు చెందినదే అని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ, అది తనది కాదని కేటీఆర్ గతంలో స్పష్టత ఇచ్చారు. కానీ, తన స్నేహితుడి నుంచి తాను దాన్ని లీజుకు తీసుకున్నానని చెప్పారు. బ‌ఫ‌ర్ జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో కానీ త‌న‌కు ఎలాంటి ఫామ్‌ హౌస్‌లు లేవని చెప్పారు. ఆ ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉంటే తానే దగ్గరుండి దాన్ని కూలగొట్టిస్తానని కేటీఆర్ చెప్పారు. 


ఇరిగేషన్ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా జన్వాడ ప్రాంతంలో పరిస్థితిని మంగళవారం పరిశీలించారు. కూల్చివేతకు ఎంత సమయం పడుతుంది? ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు? లాంటి విషయాలను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. కూల్చివేతకు ఎన్ని యంత్రాలు అవసరం అనే దానిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అయితే కచ్చితంగా ఎప్పుడు కూల్చివేస్తారనే దానిపై స్పష్టత లేదు.


ప్రముఖుల ఫాం హౌస్‌లు ఇక్కడే..!!
అయితే, జన్వాడ ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్‌తో పాటు మరికొందరు ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. కొంతమంది సినీ ప్రముఖలు ఇక్కడ ఫామ్ హౌస్‌లు కట్టుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఒకేసారి నిబంధనలు ఉల్లంఘించిన అందరి నిర్మాణాలను కూల్చివేస్తారని అంటున్నారు.