Free Bus for Women in Telangana: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై హైదరాబాద్ నాగోల్ కు చెందిన హరీందర్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. నేడు (జనవరి 31) ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ తీవ్రంగా పెరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు కూర్చునే పరిస్థితి కూడా లేదని.. కనీసం నిల్చునే పరిస్థితి కూడా సమస్య అవుతోందని పిటిషన్ లో వివరించారు. ఫలితంగా ఆటోల యజమానులు తమకు ప్రయాణికులు లేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉచిత ప్రయాణం కోసం జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీలో వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఇందులో ప్రజా ప్రయోజనం ఏమీ లేదని అభిప్రాయపడింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఉచిత ప్రయాణంతో పిటిషనర్ ఇబ్బందులను ఎదుర్కొని పిల్‌ను దాఖలు చేశారని అభిప్రాయపడ్డ ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.
పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాడిన రాష్ట్ర ఆర్టీసీలో ఉచిత పథకాలు పెట్టే అధికారం రాష్ట్రానికి లేదని అన్నారు. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ మీద పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించడం అన్యాయమని పిటిషన్‌లో వివరించారు. ట్యాక్సుల రూపంలో ప్రజల దగ్గర డబ్బు వసూళ్లు చేసి.. ఆ డబ్బును డెవలప్మెంట్ కు ఖర్చు చేయకుండా.. మహిళలకు ఫ్రీ ప్రయాణం కల్పించడం సరికాదని పిటిషనర్ వాదించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే నిలిపివేసేలా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పిటిషనర్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ
2023 నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ 7న జీవో జారీ చేసి పథకాన్ని అమలు చేసింది. ఉచిత ప్రయాణం మొదలు కాగానే.. మహిళలు విపరీతంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడం మొదలుపెట్టారు. దీంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.