Revanth Reddy on Unemployment in Telangana: రాబోయే ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ లెటర్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. అతి త్వరలోనే ఖాళీగా ఉన్న 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నప్పటికీ.. ఆర్థిక భారం ఎక్కువ అయినప్పటికీ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు.
ఎంతో మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇవ్వడం.. నిరుద్యోగుల కలల సాకారం చేయటంలో ఇది తొలి అడుగు అని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య అని గుర్తుచేశారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని.. పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడాలనే వారికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో వారిదే కీలకపాత్ర అని అన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. గత ప్రభుత్వం వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించారని అన్నారు. కేసీఆర్ కుమార్తె కవితను ప్రజలు ఓడిస్తే వెంటనే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉపాధి కల్పించారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి కేసీఆర్ ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు.
టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించామని అన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మీ అల్లుడ్ని పిలిచి గడ్డిపెట్టండి - రేవంత్
‘‘పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదు. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వచ్చాయి. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే మా ప్రభుత్వంపై హరీష్ శాపనార్థాలు పెడుతుండు. హారీష్ రావు గారు.. పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదు. అవాకులు చెవాకులు పలకడం కాదు... ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడండి. కేసీఆర్ గారు.. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. మా ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది.
త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతాం..
ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా. నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు మేం కట్టుబడి ఉన్నాం. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. మీ కళ్ళల్లో ఆనందం చూసి.. ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లు కుళ్లుకున్నా.. కడుపులో దుఃఖం పొంగుకొచ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదు’’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.