Harish Rao Latest News:ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హరీష్‌రావుపై 2024 డిసెంబర్‌లో ఈ కేసు నమోదు అయింది. 


రాజకీయ కుట్రపూరితంగానే తనపై కేసు పెట్టారని హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. మొదట్లో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెబుతూ వచ్చిన హైకోర్టు ఇవాళ(20 మార్చి 2025) కీలక తీర్పు వెల్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, కనీసం విచారణ చేయకుండానే  పోలీసులు FIR ఫైల్ చేశారని కోర్టు తప్పుపట్టింది. సుదీర్ఘ వాదనల అనంతరం తుదితీర్పును వెలువరించింది.


హరీష్ రావుపై నమోదైన కేసులో ఎలాంటి ఆధారాలు లేని అందుకే కొట్టేస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడం సర్వసాధారమైపోయిందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి హైకోర్టు గుణపాఠం నేర్పిందని అభిప్రాయపడ్డారు. 
 
చక్రధర్‌గౌడ్‌ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తన ఫోన్‌ను ట్యాప్ చేసి వేధించారని పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరిత కేసని కొట్టేయాలని హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు ఫిబ్రవరి 27 నాటికే పూర్తి అయ్యాయి. తీర్పును మాత్రం హైకోర్టు గురువారం వెలువరించింది.  


హరీష్‌రావు తరఫున దామ శేషాద్రినాయుడు, ఆర్‌ చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం భయభ్రాంతలుకు గురి చేసేలా కేసులు పెడుతోందని ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ఈ కేసు వేసిన వ్యక్తి చక్రధర్‌గౌడ్‌పై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి కేసులు ఉన్న వ్యక్తికి మద్దతుగా ప్రభుత్వం వాదనలు చేస్తోందన్నారు. ప్రత్యర్థులను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని వాదించారు. 


ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసును బలపరిచే ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చింది. అందుకే ఈ కేసు కొట్టేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు అధికారులు ఇరుక్కున్నారు. ఆ కేసు సాగుతున్న టైంలోనే హరీష్‌రావుపై కేసు నమోదు కావడం అప్పట్లోనే సంచలనంగా మారింది. ఆయన్ని కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. ఇంతలో హైకోర్టు జోక్యంతో కేసు విచారణకు అడ్డంకి ఏర్పడింది.  ఇప్పుడు ఏకంగా కేసు కొట్టేయడంతో ఏం చేయనున్నారనే ఉత్కంఠ నెలకొంది.