Telangana News: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు మరో కీలక పరిణామం జరిగింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలన్న అసెంబ్లీ సెక్రటరీ అభ్యర్థనను హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంపై ఈనెల 24న వాదనలను వింటామని తెలిపింది.
స్టే ఇచ్చేందుకు నిరాకరణ
బీఆర్‌ఎస్ పార్టీ తరఫున విజయం సాధించి అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సహా పలువురు వేసిన పిటిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. నెల రోజులు క్రితం సెప్టెంబర్ 9న విచారణ సందర్భంగా అసెంబ్లీ సెక్రటరీకి, స్పీకర్‌కు సూచనలు చేసింది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకొని షెడ్యూల్‌ను బెంచ్ ముందు ఉంచాలని ఆదేశించింది. లేకుంటే సుమోటోగా తామే ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరని చెప్పేసింది. తదుపరి వాదనలు 24న వింటామని పేర్కొంది.
ఆగస్టులో విచారణ- సెప్టెంబర్‌లో తీర్పు
హైకోర్టులో ఏప్రిల్‌లో పిటిషన్ వేసే నాటికి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ మారారు. వాళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఆగస్టు 7న వాదనలు పూర్తి అయ్యాయి. తర్వాత తీర్పును హైకోర్టు సింగిల్ బెంచ్ రిజ్వర్ చేసింది. సెప్టెంబర్ 9న సోమవారంనాడు తీర్పు వెలువరించింది.
అరికెపూడి వర్శెస్ కౌశిక్ రెడ్డి
ఏప్రిల్ తర్వాత మరికొందరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా వెళ్లి వచ్చిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా కూడా చేయడం ఈ మధ్య కాలంలో పెను వివాదానికి కారణమైంది. ఆ టైంలో కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య తీవ్ర వార్ నడిచింది. తాను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటూ అరికెపూడి వాదిస్తుంటే...లేదు పార్టీ మారుతున్నట్టు కండువా కూడా మార్చుకున్నారని ఆరోపిస్తూ వస్తోంది బీఆర్‌ఎస్.
వాట్ నెక్ట్స్
ఈ వివాదాలు నడుస్తుండగానే అసెంబ్లీ సెక్రటీ అభ్యర్థను హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించడంతో తర్వాత ఏం జరగనుందనే ఆసక్తి మొదలైంది.