IAS Srilakshmi petition in Obulapuram mining case | హైదరాబాద్: ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో తనపై నమోదైనే కేసును కొట్టివేయాలంటూ ఆమె హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను నిర్దోషిగా ప్రకటించాలని పిటిషన్‌లో శ్రీలక్ష్మీ కోరారు. ఐఏఎస్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. సీబీఐ, ప్రతివాదుల వాదనలను పరిగణనలోకి తీసుకుంది. తాజాగా ఆమె పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మైనింగ్ కేసులో ఇదివరకే కోర్టు ఆమెను నిందితురాలిగా తేల్చింది. తెలంగాణ కోర్టు తీర్పు రావడంతో ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మీ పాత్రపై సీబీఐ విచారణ చేపట్టనుంది.
గతంలో సుప్రీంకోర్టు షాక్, ఇప్పుడు హైకోర్టులోను చుక్కెదురు
ఓబులాపురం కేసు నుంచి ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బయటపడ్డారని అంతా అనుకున్నారు. కానీ కేసులో శిక్షలు ఖరారైన మరుసటి రోజే సుప్రీంకోర్టు ఆమెకు షాకిచ్చింది. ఈ కేసు నుంచి శ్రీలక్ష్మిని హైకోర్టు గతంలోనే డిశ్చార్జ్ చేసింది. అయితే హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయాలని ఆదేశించింది. త్వరలో విచారణ చేయాలని మే మొదటి వారంలోనే కోర్టు సీబీఐకి సూచించింది.
శ్రీలక్ష్మీకి గతంలో హైకోర్టులో ఊరట
కర్ణాటకకు చెందిన బిజినెస్ మ్యాన్ గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్ కేసులో అప్పటి ప్రభుత్వంలో మైనింగ్ శాఖ ఉన్నతాధికారిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉన్నారు. అవకతవకలకు పాల్పడి గాలి జనార్ధన్ రెడ్డికి అర్హత లేకపోయినా లీజులు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. ఆమె పలు తప్పిదాలు చేసినట్లు సీబీఐ కేసులు నమోదు చేసి విచారణ జరిపింది. గాలి జనార్ధన్ రెడ్డికి సహాయం చేసినందుకు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుతో తనకు సంబంధం లేదని మొదట సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేయగా, కోర్టు కొట్టి వేసింది. తరువాత హైకోర్టులో పిటిషన్ వేశారు. 2022లో హైకోర్టు ఆమెను కేసు నుంచి డిశ్చార్డ్ చేస్తూ తీర్పిచ్చింది.
సుప్రీంను ఆశ్రయించిన సీబీఐతాము చూపించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుడా హైకోర్టు శ్రీలక్ష్మీని కేసు నుంచి డిశ్చార్జ్ చేశారని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా విచారణ చేయాలని సీబీఐకి సూచించింది. దాంతో శ్రీలక్ష్మీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్‌లతో పాటు ఓఎంసీ కంపెనీని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. ఇందులో ఏ1గా ఉన్న శ్రీనివాసరెడ్డి సహా నిందితులందరికీ 7 ఏళ్లు జైలుశిక్ష విధించారు. ఓఎంసీ కంపెనీకి లక్ష జరిమానా విధించారు. ఏపీ (అనంతపురం), కర్ణాటక సరిహద్దుల్లో పర్మిషన్ కు మించి ఐరన్ ఓర్ తవ్వేసి.. రాష్ట్ర సరిహద్దులు సైతం చెరిపేశారని కేసులున్నాయి. 2009లో సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బళ్లారి నుంచి గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. కొన్నేళ్ల జైల్లో ఉన్న తరువాత బెయిల్ మీద వ్యాపారవేత్త విడుదలయ్యారు.