తెలంగాణలో కరోనా పరిస్థితులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు వేసింది. వివిధ అంశాల్లో స్పష్టత కోరింది. స్కూళ్లకు సెలవులు ఈ నెలాఖరుతో ముగియనున్నందున 31 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందించారు. స్కూళ్ల పున:ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అంతేకాక, బస్తీలు, ఇతర ప్రాంతాల్లో జరిగే వారాంతపు సంతల నిర్వహణలో కరోనా నియంత్రణ చర్యలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. కొద్ది రోజుల్లో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై కూడా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
శుక్రవారం మధ్యాహ్నం కరోనా పరిస్థితులపై విచారణ ఆన్ లైన్ ద్వారా జరిగింది. ఈ విచారణలో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 3.16 శాతం ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 77 లక్షల ఇళ్లలో ఫీవర్ సర్వే చేపట్టామని, బాధితులకు మొత్తం 3.45 లక్షల కరోనా కిట్లు అందజేశామని డీహెచ్ వివరించారు. ఈ కిట్లలో పిల్లల చికిత్సకు సంబంధించిన ఔషధాలు లేవని న్యాయవాదులు ప్రస్తావించగా.. వారి మందులను కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్ అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 3,944 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,51,099కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,081కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 39,520 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 2,444 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,07,498కి చేరింది.
15 ఏళ్లు వచ్చిన వాళ్లు అర్హులే
కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2023 జనవరి నాటికి 15 ఏళ్లు నిండిన వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. 15- 18 ఏళ్ల మధ్య వయసు వారితో పాటు వీరు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. 2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన వారు కూడా ఈ 15-18 ఏళ్ల కేటగిరీలోకే వస్తారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ కేటగిరీకి చెందిన 59 శాతం మంది పిల్లలు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొంది.