Telangana News | హైదరాబాద్: ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా మూసీ నది ప్రక్షాళణకు తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ క్రమంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (Musi Riverfront Development Project)కుగాను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.1500 కోట్లలో ప్రస్తుతానికి రూ.375 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ ప్రక్షాళనను ప్రతష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను ఇప్పటికే సంగ వరకు తొలగించింది.
ప్రస్తుతం మూసీ నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు. మూసీ ప్రక్షాళన కోసం రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం విదేశాలలో పర్యటించి అక్కడ నది మధ్య ఉన్న నగరాలను పరిశీలించడం తెలిసిందే. తాజాగా నిధుల విడుదలకు పరిపాలనా పరమైన నిర్ణయానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడంతో మూసీ ప్రక్షాళన మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.
మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు
మూసీ నది సుందరీకరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం రూ.4,100 కోట్ల రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (Asian Development Bank) ఆమోదం తెలపడం తెలిసిందే. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి కోసం నియమించిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు రాష్ట్రానికి వచ్చిన ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ బృందానికి మూసీ నది ప్రక్షాళనతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న హరిత కర్యాక్రమాలు, పర్యావరణ కార్యక్రమాల గురించి సైతం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని అర్థం చేసుకున్న ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు విడుదలకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుకు రూ.375 కోట్లు విడుదల చేసింది.
ఈ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా నదికి ఇరువైపులా రోడ్లతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. మూసీ నదిలో వరద నీరుతో పాటు డ్రైనేజీ నీరును వేరు చేసేందుకు ఇంటర్ సెప్టర్ ఛానెల్ నెట్‌వర్క్ విధానంలో మూసీ రివర్ ఫ్రండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూపకల్పన చేశారు.