Telangana Crop Loans: రుణమాఫీ... తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఆగస్టు 15లోగా 2లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి... ఆగస్టు 15లోగా మూడు విడతల్లో రుణమాఫీ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ... చాలా మంది రైతులకు రుణమాఫీ అందలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో... ప్రభుత్వం విమర్శలు ఎక్కుపెట్టింది ప్రతిపక్షం. రుణమాఫీని... తూతూ మంత్రంగానే చేశారని విరుచుకుపడుతోంది. ఇది... ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. రుణమాఫీ చేసినా... విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ సర్కార్‌కి.
ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీ ఎవరెవరికి అందలేదు... ఎందుకు అందలేదో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి... రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలను గుర్తించారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. ఆ నివేదికలో సమస్యలతో పాటు... వాటి పరిష్కారాలను కూడా సూచించారు.
రుణమాఫీ అమలులో ప్రధాన సమస్యలు...
1. రైతుల బ్యాంక్ అకౌంట్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం
2. ఆధార్‌కార్డులో పేరు, లోన్ అకౌంట్ పేరు వేరువేరుగా ఉండటం
3. రుణాలు తీసుకున్న రైతు కుటుంబంలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కావడం లేదా పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉండటం
4. ఒక రైతుకు ఒకటి కంటే ఎక్కువ లోన్ అకౌంట్లు ఉన్నా రుణమాఫీ వర్తించదు
5. రుణమాఫీ కోసం ప్రభుత్వం పెట్టిన నిబంధనల పరిధిలో లేకపోవడం
అయితే... ఇవన్నీ సాంకేతిక సమస్యలు. రైతులకు భూమి, మట్టి, విత్తనాలు... వీటిపై తప్ప... టెక్నికల్ విషయాల గురించి పెద్దగా అవగాహన ఉండదు. దీంతో... ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సి ఉంది. అందుకే... ప్రభుత్వం.. రుణమాఫీ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రుణమాఫీ కాని రైతులను గుర్తించి... వారికి ఎందుకు పంట రుణం కాలేదు... దానికి గల కారణాలను ఆరా తీయాలని తెలిపింది. అర్హత ఉండి.. రుణమాఫీ అందని రైతుల జాబితా సిద్ధం చేయాలని సూచించింది. అర్హులకు రుణమాఫీ అందాలని.. అందుకోసం ఎలా ముందకు వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
పంట రుణాల వడ్డీ రేట్లపై తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్...
రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీ చేసి చేతులు దులుపుకోకుండా... కొత్తగా తీసుకోబోయే పంట రుణాలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. తక్కువ వడ్డీ రేటుకే పంట రుణాలు అందేలా కసరత్తు చేస్తోంది. మామూలుగా.... బ్యాంకులు, సహకార సొసైటీలు తక్కువ వడ్డీకే రైతులకు పంట రుణాలు ఇస్తుంటాయి. బ్యాంకుల్లో రుణాలు పొందలేని రైతులు... ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. వారు భారీ వడ్డీకి రుణాలు ఇస్తుంటారు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్ వ్యాపారుల దోపిడీకి త్వరలోనే చెక్ పెట్టనుంది. ప్రైవేట్ వ్యాపారులు... రైతులకు ఇచ్చే పంట రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించబోతోంది. గతంలో ఇచ్చిన మనీలెండర్స్ యాక్ట్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది. ప్రైవేట్ వ్యాపారులు... 2 శాతానికి మించి వడ్డీ వసూలు చేయకుండా... కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. దీంతో చాలా మంది అన్నదాతలకు ఊరట లభిస్తుంది.
Also Read: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షావరణం- హైదరాబాద్‌సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్