తెలంగాణలో ఈ మధ్య కాలంలో వర్షం వస్తే చాలు వరదలు ముంచెత్తుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉంటోన్నా సరే నష్టం మాత్రం తప్పడం లేదు. అందుకే ఈ వరద నివారణ కోసం శాశ్వత చర్యలు చేపట్టనుంది. 


వరదల నివారణతోపాటు అనంతరం చేపట్టే చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వరదలు వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వాలు పని చేసిన విధానంపై స్టడీ చేస్తోంది. కొన్ని సంవత్సరాల నుంచి భారీగా నష్టాన్ని కలిగించిన వరదలను ప్రామాణికంగా తీసుకొని  తెలంగాణ ప్రభుత్వం స్టడీ చేస్తున్నట్టు అర్థమవుతుంది. 


ఈ స్టడీ కోసం ఆరుగురితో కూడిన ఇంజినీర్ల బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ బృందానికి ఇరిగేషన్ శాఖ ఓ అండ్‌ ఎం ఇంజినీర్‌ ఇన్ చీఫ్‌ నాగేంద్రరావు నాయకత్వం వహిస్తున్నారు. సభ్యులుగా భద్రాద్రి కొత్తగూడెం సీఈ శ్రీనివాస్ రెడ్డి, సీడీఓ సీఈ కేఎస్‌ఎస్‌ చంద్రశేఖర్, ప్రభుత్వం సలహాదారు విజయ్ ప్రకాష్ కన్సల్టెంట్‌ పి. రామరాజు, పీ అండ్‌ ఎం పర్యవేక్షక ఇంజినీరు శ్రీనివాస్‌ ఉన్నారు. 


ఈ ఆరుగురు సభ్యుల బృందం వరదలు వచ్చిన ప్రాంతాల్లో తిరుగుతూ  ఆయా ప్రభుత్వాలతో మాట్లాడుతోంది. అక్కడ వారు తీసుకున్న చర్యలు గురించి తెలుసుకుంటోంది. ఇప్పుడు ఈ టీం ఒడిశాలోని మహానది ప్రాంతంలో సర్వే చేస్తోంది. అక్కడ మహానదికి వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యలు, రక్షణకు ఏర్పాటు చేసిన కరకట్టల గురించి తెలుసుకుంటోందీ బృందం 


ఒడిశాలో పర్యటన పూర్తి చేసుకొని శుక్రవారం సాయంత్రానికి తిరిగి రానుందీ బృందం. రెండురోజుల తర్వాత మళ్లీ అసోం వెళ్లనున్నందీ టీం.