Telangana Secretariat Security : తెలంగాణ సచివాలయం (Telangana Secretariat ) భద్రత విషయంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం సెక్రటేరియట్ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ (TSSP) విభాగం పర్యవేక్షిస్తోంది. దీన్ని  తిరిగి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ( SPF) అధీనంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయం భద్రతపై ప్రభుత్వం అంతర్గతంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త సచివాలయ భవనం ప్రారంభమైన తర్వాత నుంచి టీఎస్‌ఎస్‌పీ భద్రతను పర్యవేక్షిస్తోంది. సచివాలయ ఉద్యోగులతోపాటు సందర్శకులను లోపలికి అనుమతించే యాక్సెస్‌ కంట్రోల్‌ వంటి కీలక బాధ్యతల్ని టీఎస్‌ఎస్‌పీ సిబ్బంది నిర్వర్తిస్తోంది. సచివాలయం నలువైపులా ఏర్పాటు చేసిన సెంట్రీ పోస్టుల్లో పహారా కాస్తున్నారు. హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌ పరిధిలోని శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్‌ పోలీసులూ, సాయుధ రిజర్వ్‌ పోలీసులు...సెక్రటేరియట్ భద్రతలో పాల్గొంటున్నారు. అన్ని షిఫ్టుల్లో కలిపి వీరంతా 650 మంది ఉన్నారు. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సెక్రటేరియట్ బాధ్యతలు ఎస్పీఎఫ్ పర్యవేక్షణలోనే ఉండేవి. కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో... కార్యాలయాలు బీఆర్‌కే భవన్‌కు తరలించారు. అక్కడ కూడా ఎస్పీఎఫ్ సిబ్బందే భద్రత నిర్వహించింది. నూతన సచివాలయం పూర్తయిన తర్వాత సెక్రటేరియట్‌ భద్రత వ్యవహారాలను... అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ విభాగానికి అప్పగించింది. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. తాజాగా మళ్లీ ఎస్పీఎఫ్‌కు సెక్రటేరియట్ బాధ్యతల్ని అప్పగించేందుకు ప్రబుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితమే ఎస్పీఎఫ్‌ ఉన్నతాధికారులను పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 


డిజిటల్ పాస్​లతో ప్రవేశించే సందర్శకులు సచివాలయంలో ఎంతసేపు ఉన్నారు ? ఎవరెవరిని కలిశారు అనే సమాచారం డిజిటల్​గా రికార్డు అవ్వనుంది. వచ్చిన వ్యక్తే మరోసారి వస్తే పాత రికార్డు ఆధారంగా వీళ్లు ఇంతకు ముందు వచ్చారనే సమాచారం తెలిసిపోతుంది. అలాంటి టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా ఒక వ్యక్తి ఎన్నిసార్లు సచివాలయాన్ని సందర్శించారు అనే సమాచారం నిక్షిప్తమవ్వనుంది. సెక్రటేరియట్​లో అన్ని విభాగాల్లో పనిచేసే సుమారు రెండు వేల మంది ఉద్యోగుల కోసం ప్రత్యేక పాస్​లు ఇచ్చారు. వీరి పాస్​లను డైరెక్టర్‌, హెచ్‌వోడీ, సెక్షన్‌ ఆఫీసర్‌ వివిధ ఉద్యోగాల వారీగా విభజించారు. ఉద్యోగ స్థాయిని బట్టి ఒక్కో స్థాయికి ఒక్కో రంగుతో కూడిన పాస్​లను జారీ చేశారు. సెక్రటేరియట్ భద్రత బాధ్యతను నిర్వహించే పోలీస్​శాఖ పర్యవేక్షణలో ఈ డిజిటల్ పాస్​లను పంపిణీ చేశారు. సెక్రటేరియట్​కు వచ్చే సందర్శకుల కదలికలను పోలీసులు కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ సచివాలయంలో మొత్తం 300 వరకు సీసీ కెమెరాలున్నాయి. ఇదంతా కమాండ్ కంట్రోల్ రూమ్​కే అనుసంధానించి ఉంటుంది. ఇలా సెక్రటేరియట్​లోని ప్రతి అంగుళం నిఘా నీడలోనే ఉంటుంది.


మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  భద్రతలో ఇంటెలిజెన్స్‌ విభాగం కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే వాహనాల కాన్వాయ్‌ను మార్చిన ఇంటెలిజెన్స్....తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌ వద్ద పనిచేసిన భద్రత సిబ్బందిని తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత మార్పులు జరిగాయి. రేవంత్‌రెడ్డికి సంబంధించిన సమాచారం బహిర్గతమవడంతోనే సిబ్బందిని మార్చారనే జరుగుతోంది.