111 నెంబర్ జీవోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆ జీవో కారణంగా అమల్లో ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ మరో జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం. 69 నెంబర్ జీవో జారీ చేసి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో జంట జలాశయాల పరిధిలో నిర్మాణాలకు ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవు. సుమారు 84 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది.
కొత్తగా తీసుకున్న నిర్ణయం వల్ల జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేస్తారు. ఈ కమిటీ ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రీన్ జోన్లను ఏర్పాటు చేస్తుందీ కమిటీ దీని వల్ల జలాశయాలకు ఎలాంటి హాని జరగకుండా చూస్తుంది.
అంతే కాకుండా ఎస్టీపీలు ఏర్పాటు చేసి జలాశయాలకు ఎలాంటి హాని జరగకుండా చూస్తుందీ సీఎస్ కమిటీ. ఎస్టీపీల నుంచి వచ్చే వ్యర్థాలు జలశాయాల్లో కలవకుండా జాగ్రత్త పడతారు. కలుషితం కాకుండా చూస్తారు. ఈ మురుగు నీరు జలాశయాల్లోకి వెళ్లకుండా ప్రత్యేక టాక్స్ లైన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
అసలేంటీ జీవో 111
హైదరాబాద్ శివారులో గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలు ఉన్నాయి. వీటిని జంట జలాశయాలు అంటారు. వీటి పరిరక్షణకు తీసుకొచ్చిందే ఈ జీవో 111. ఈ జీవో ప్రకారం ఈ జలాశయాల పరిధిలోని పది కిలోమీటర్ల వరకు కాలుష్యకారక ఫ్యాక్టరీలు, హోటళ్లు, కాలనీలు నిర్మించడానికి వీల్లేదు.
జంట జలాశయాల పరిరక్షణ కోసం 1994లో 192 నెంబర్ జీవో తీసుకొచ్చారు. అందులో కొన్ని లోపాలు సవరించి 1996 మార్చి 8న మరో జీవో తీసుకొచ్చారు. అదే 111 నెంబర్ జీవో. దీని ప్రకారం క్యాచ్‌మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60 శాతం ఓపెన్ ప్లేస్ ఉంచాలి. రోడ్ కోసం ప్రత్యేకంగా స్థలం విడిచి పెట్టాలి. వినియోగించే భూమిలో 90 శాతం కన్జర్వేష్ కోసం కేటాయించాలి. రసాయనాలు, క్రిమిసంహారకాల నియంత్రణకు ప్రత్యేక ఏజెన్సీతో ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ ఉండాలి. ఈ జీవో అమలులో ఉన్న ప్రాంతంలో జీ ప్లస్ టు మించి నిర్మాణాలు చేయడం నిషేధం.
ఈ జీవో పరిధిలోకి ఎనిమిది మండలాలు వస్తాయి. అవి మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ ఈ జీవో పరిధిలోకి వచ్చే మండలాలు. ఇప్పడు ఈ జీవో రద్దుతో ఈ మండలాల్లోని 84 గ్రామాలకు ఊరట లభించనుంది.