Hyderabad Drugs Smuggling : డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది దందా చేసే పెడ్లర్లు అంతకు మించిన ఎత్తులు వేస్తున్నారు. అలాంటి డ్రగ్స్ రాకెట్‌ను తెలంగాణ ఈగల్ టీం పట్టుకుంది. ఓ రెస్టారెంట్ కేంద్రంగా సాగుతున్న దందా గుట్టు రట్టు చేసింది. ఇద్దరి అరెస్టుతో మొత్తం పెద్ద రాకెట్ బాగోతమే బయటకు వచ్చింది.
హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ స్థానికంగా సుపరిచితమే. ఎవరికీ అనుమానం రాకుండా దీని కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతున్నట్టు ఈగల్ టీం క్యాచ్ చేసింది. విషయం తెలుసుకున్న టీం సభ్యులు మాటు వేసి డ్రగ్స్ సరఫరాలో కీలకంగా ఉన్న రెస్టారెంట్ ఓనర్ సూర్యను పట్టుకున్నారు.
రెస్టారెంట్ కేంద్రంగా చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారంలో అనేక కోణాలను పోలీసులు బహిర్గతం చేశారు. సూర్య పెంచుకున్న నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌లో ఉండే పబ్‌లు, వైద్యులు, ఇంకా వివిధ వర్గాల ప్రజలు ఇలా చాలా మంది భాగమై ఉన్నారు. నెట్‌వర్క్‌లో ఉన్న వారందరికీ కూడా మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య నేతృత్వంలోనే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.
సూర్యకు హర్ష అనే ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా తన కాంటాక్ట్స్‌ను ఉపయోగించి డ్రగ్స్‌కు సంబంధించిన బేరాలు తీసుకొచ్చేవాడు. అలా వచ్చిన భీమవరం వాసి డాక్టర్ ప్రసన్న. ఈయన ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజీ వైద్యుడిగా పని చేస్తున్నాడు. 20సార్లకుపైగా సూర్య, హర్ష ఇద్దరూ ఆయనకు డ్రగ్స్ సరఫరా చేశారు.
23 మంది వ్యాపారవేత్తలకి కూడా సూర్య గ్యాంగ్ డ్రగ్స్ సరఫరా చేసింది. ప్రముఖ పబ్‌లకు వెళ్లి డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు యాజమాన్యాలు చేస్తున్నాయని తేలింది. ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్‌లలో పార్టీలు జరుగుతున్నట్టు ఈగల్ టీం గుర్తించింది.
వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులైన క్వాక్ రాజ్‌శేఖర, పృథ్వీ వీరమాచినేని, రోహిత్ మాదిశెట్టిపై కేసులుపెట్టారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు సూర్య తన స్టేట్మెంట్‌లో వెల్లడించారు. ములుగులోని రిసార్ట్‌లోకి ఫ్రెండ్స్‌ని పిలిచి పార్టీలు ఇచ్చినట్టు కూడా ఒప్పుకున్నాడు. కొంపల్లిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో దాడి చేసి సూర్య గ్యాంగ్ ఆటకట్టించింది ఈగల్ టీం.
డ్రగ్స్ సరఫరాపై అన్ని ప్రాంతాల్లో నిఘా పెరిగింది. అందుకే విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందీ గ్యాంగ్. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ చెప్పుల మాటున డ్రగ్స్ సరఫరా చేశారు. లేడీస్ వేసుకునే ఐ హీల్స్ లోపల ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా డ్రగ్స్ ప్యాక్ చేశారు. ఢిల్లీ వరకు ఏదో తంటాలు పడి డ్రగ్స్ తీసుకొచ్చే నైజీరియన్స్, చెప్పుల్లో పెట్టి హైదరాబాద్ పంపించేవాళ్లు.
నైజీరియన్ నుంచి డ్రగ్స్ తీసుకురావడానికి ఓ ప్రత్యేక టీం పని చేస్తోంది. దీనిపైనే ఈగల్ టీం ప్రత్యేక దృష్టి పెట్టింది. సూర్య గ్యాంగ్ అరెస్టుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన నిక్కి, జెర్రీ సూర్యతో కలిసి డ్రగ్స్ సరఫరా చేసే వాళ్లు. ఇప్పుడు సూర్య, హర్షను అరెస్టు చేసిన పోలీసులు మిగతా వారి వేటలో ఉన్నారు.
మల్నాడు హోటల్ జనరల్ మేనేజర్ నందకుమార్ మాట్లాడుతూ... " మా హోటల్‌లో ఏం జరగలేదు. హోటల్ యజమాని రిలేటివ్స్‌కు సంబంధించి బయట ఏదో ఇష్యూ జరిగితే అనవసరంగా హోటల్‌పై రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. నా రిక్వస్ట్ ఏంటంటే... రూమర్స్ స్ప్రెడ్ చేసి హోటల్ రిపిటేషన్ దెబ్బతీయొద్దు. హోటల్‌ను నమ్ముకొని 120 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారి కడుపు కొట్టినట్టు అవుతుంది. నిజానిజాలు తెలుసుకొని న్యూస్ రాయండి. సూర్య అనే వ్యక్తి మా హోటల్ యజమానికి రిలేటివ్. హోటల్ మొత్తం కెమెరాలు ఉన్నాయి. ఐదేళ్లుగా ఇక్కడ హోటల్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేదు. " అని చెప్పుకొచ్చారు.