హైదరాబాద్‌‌లోని సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్యపై అనుమానాలు ఏమీ లేవని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాజు మరణంపై అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్న వేళ శుక్రవారం మధ్యాహ్నం డీజీపీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వరంగల్ స్టేషన్ ఘన్‌పూర్ మార్గంలో వెళ్తున్న కోణార్క్‌ రైలు లోకో పైలట్లు రాజు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులని వివరించారు. రాజు స్వయంగా ఆత్మహత్య చేసుకోవడం కోసం రైలు కింద పడటం వాళ్లు చూశారని డీజీపీ తెలిపారు. ఈ విషయాన్ని లోకో పైలట్లే సంబంధిత అధికారులకు తెలియజేశారని చెప్పారు.


గ్యాంగ్‌మెన్‌ కూడా రాజు ట్రాక్‌పై తిరగడం చూశారని అన్నారు. నిందితుడు రాజు రైలు కింద పడటం రైతులు కూడా చూశారని తెలిపారు. మొత్తంగా రాజు ఆత్మహత్యను ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారని డీజీపీ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. తొలుత అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజును వెంటనే అతన్ని ప్రశ్నించగా.. పక్కనున్న చెట్ల పొదల్లోకి పారిపోయాడని.. మళ్లీ కాసేపటికి తిరిగివచ్చిన గాంగ్‌మెన్‌కు పట్టాలపై రాజు శవం కనిపించిందని తెలిపారు. రాజు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు కింద పడడం అక్కడే పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూడా చూశారని పేర్కొన్నారు. రైలు లోకో పైలట్లు సైతం సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేశారని డీజీపీ చెప్పారు.


ప్రత్యక్ష సాక్షుల వీడియో స్టేట్‌ మెంట్‌‌ను వీడియో రికార్డు చేసినట్లుగా డీజీపీ వెల్లడించారు. ఆత్మహత్యపై ఘన్‌ పూర్‌తో పాటు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు లోకో పైలట్లు ఘటనను ఇద్దరు అధికారికంగా రికార్డు చేశారని తెలిపారు. నిందితుడు రాజు ఆత్మహత్యపై అనవసర రాద్ధాంతాలు వద్దని.. ఎవరి వద్దనైనా ఆధారాలుంటే మాట్లాడాలని సూచించారు. తప్పుదోవ పట్టించే విధంగా ఎవరూ ప్రయత్నించ వద్దని డీజీపీ కోరారు.


జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన హైకోర్టు
సైదాబాద్‌లో బాలికను అత్యాచారం, హత్య చేసిన పల్లకొండ రాజు మృతిపై హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. వరంగల్ మూడో మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. లైంగిక దాడి, బాలిక హత్య కేసులో నిందితుడు రాజు చనిపోవడంపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు రాజును హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ వాదించారు. అయితే, అతణ్ని హత్య చేయలేదని రాజు ఆత్మహత్య చేసుకున్నాడని హైకోర్టుకు ఏజీ తెలిపారు.