తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల అధికారులు అక్టోబరు 3న హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈ సన్నాహక సమావేశం నిర్వహించారు. మూడో తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎన్నికల అధికారుల బృందం అధికారులు నగరంలోనే ఉండనున్నందున వారితో చర్చలు జరిపే అధికారులకు సీఎస్ కీలక సూచనలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లతో పాటు సీనియర్ అధికారులు అందుబాటులో ఉండాలని సీఎస్ వారికి సూచించారు. రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై అవగాహన కలిగి ఉండాలని నిర్దేశించారు. పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు అందించేలా చూడాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.


ఈ సమావేశంలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం శాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వీ కరుణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


3 నుంచి మూడు రోజుల పాటు పర్యటన
అక్టోబర్‌ 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఎన్నికల అధికారులు పర్యటించనున్నారు. తెలంగాణలో వీరు ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వీరు రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటారు.


అంతేకాకుండా, ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా వంటి నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో కూడా ఎన్నికల సంఘం అధికారులు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ప్రలోభాల కోసం ఉపయోగించే డబ్బు, లిక్కర్, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల నోడల్‌ అధికారులతో సమావేశం జరుపుతారు. భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై రివ్యూ చేస్తారు. 


రెండో రోజు అన్ని జిల్లాల్లోని ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఈసీ బృందం భేటీ అవుతుంది. జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లను రివ్యూ చేయనున్నారు. మూడో రోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.


షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎన్నికలు
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. వచ్చే నెల 3, 4, 5 తేదీలలో తెలంగాణ జిల్లాల్లో ఈసీ టీమ్ పర్యటిస్తుందని చెప్పారు. జనవరి నుంచి ఇప్పటివరకూ కొత్తగా 15 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చామని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. ఎన్నికలకు తాము ఏర్పాటు చేస్తున్నామని, అయితే ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ఖరారు చేస్తుందన్నారు.