హైదరాబాద్ గచ్చిబౌలిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను మాత్రం ఏఐసీసీకే అప్పగిస్తున్నట్లుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీర్మానం పెట్టారు. దీన్ని భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు బలపరిచారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక ఏఐసీసీకి అప్పగించారు. అధిష్ఠానం నిర్ణయం ఏదైనా శిరసావహిస్తామని ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు అధిష్ఠానానికి పంపారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కూడా తీర్మానం చేశారు. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానం సీఎల్పీ పేరును ఖరారు చేయాల్సి ఉందని తెలిపారు. 


ఈ సీఎల్పీ సమావేశానికి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్, జార్జ్, దీపాదాస్ మున్షీ, అజయ్, మురళీధరన్, మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మె్ల్యేలు హాజరయ్యారు.