కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ ఫ్యామిలీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ర్యాలీలు నిరసనలను కాంగ్రెస్ చేపట్టింది.
తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన అగ్గిరాజేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా రాజ్‌భవన్ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు బైక్‌ను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కిలోమీటర్ కొద్ది నిలిచిపోయాయి.
కొందరు కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీసీ బస్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్‌లో చెపట్టిన ధర్నాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. రాజ్ భవన్ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు సందర్భంగా శివసేన రెడ్డి కాలు పోలీసు వాహనంలో ఇరుక్కుంది. దీంతో ఆయన పోలీసు వాహనాన్ని కాలితో తన్ని అద్దాలు ధ్నంసం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. రాజ్ భవన్ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు.
ఈడి విచారణ పేరుతో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, సోనియా గాంధీని వేధిస్తూ రోజుల తరబడి విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భగ్గుమంటోంది. దీంతోపాటు ఆందోళన చేస్తున్న కార్యకర్తలను, నేతలను ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు చొచ్చుకొని వచ్చి తీవ్రంగా కొట్టి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ ఈ చలో రాజ్‌భవన్ నిరసనకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఖైరతాబాద్ లోని పీజేఆర్ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ప్రదర్శన చేపట్టే టైంలో పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
ఈ ఉదయాన్నే రాజ్ భవన్‌ను ముట్టడించినట్టు NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు రాజ్‌భవన్‌ను ముట్టడించిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకులపై బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడి నోటీసులు ఇచ్చిందన్నారు వెంకట్.
ఏఐసీసీ పిలుపు మేరకు రేపు 17న జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.