తెలంగాణలో ఉచిత విద్యుత్ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు మంగళవారం (జూలై 11) మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్‌ అంశంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే రైతులు, రైతులు అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. దేశంలో రైతులకు అనుకూలంగా పని చేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. 


బీఆర్‌ఎస్ మంత్రులంతా ఊర కుక్కల్లా మాట్లాడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిపై రేవంత్ మాట్లాడితే ఆయన మాటలను వక్రీకరిస్తున్నారని అన్నారు. విద్యుత్ కొనుగోలులో అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్‌లో వణుకుపుడుతోందని, రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వటమే కాంగ్రెస్ ఎజెండా అని తేల్చి చెప్పారు. 


మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చిన కేసీఆర్ సర్కార్‌కు రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని పొన్నం ప్రభాకర్ నిలదీశారు. రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు. రుణమాఫీ చేయలేని కేసీఆర్ సర్కార్‌కు రైతుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడ ఉందని ప్రశ్నించారు.