Congress Janahita Padayatra | పరిగి: స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర నేడు ప్రారంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిగిలో నేడు ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర ఐదు రోజులపాటు కొనసాగనుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ , రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర కాంగ్రెస్ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు శ్రమదానాలు నిర్వహిస్తాయని తెలిపారు.
పరిగిలో కాంగ్రెస్ జనహితయాత్ర ప్రారంభం..
కాంగ్రెస్ నేతలు నేడు రంగారెడ్డి జిల్లా పరిగిలో జనహిత పాదయత్రకు శ్రీకారం చుట్టారు. చివరి రోజు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఆగస్టు 4న సమావేశం నిర్వహించనున్నారు. ఆగస్టు 5 నుంచి 7 వరకు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్లమెంట్ ఉభయసభల్లోనూ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ఎంపీలు పట్టుపట్టనున్నారు. వాయిదా తీర్మానాలు ఇచ్చి బిసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై చర్చించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరుతోంది. ఏఐసీసీ ముఖ్యనేతలు, ఎంపీలతో కలిసి ఆగస్టు 7వ తేదీన రాష్ట్రపతికి వినతిపత్రం అందజేస్తామని అని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మూడు రోజులపాటు కార్యక్రమాలు ముగిసిన తరువాత ఆగస్టు 8న జనహిత పాదయాత్ర రెండో విడత చేపడతామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నాలు
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన అంశం బి సి రిజర్వేషన్ల బిల్లు. రాష్ట్ర క్యాబినెట్, అసెంబ్లీలో ఆమోదముద్ర పడిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు 4 వరకు కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆగస్టు 6న ధర్నా నిర్వహించానున్నారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొ నున్నారు. ఆగస్టు 5న బీసీ రిజర్వేషన్లపై చర్చించాలని పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వాలని భావిస్తున్నారు.