Gandhi Sarovar Project in Hyderabad | ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ప్రధానంగా గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటి ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన 98.20 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన భూమిని సేకరించడం, ప్రాజెక్టును సకాలంలో ప్రారంభించేందుకు కీలకమని ఆయన పేర్కొన్నారు.
గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రికి అందజేశారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు ప్రాజెక్టును చేపట్టనున్నట్లు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఈ గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ జాతీయ సమైక్యతకు ప్రతీకగా, గాంధేయ విలువలను ప్రదర్శించే ఒక పటిష్టమైన చిహ్నంగా మారబోతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా గాంధీ సరోవర్, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే, గాంధీ సిద్ధాంతాలకు ఒక చిహ్నంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలిపారు.