Telangana CM Revanth Reddy at Command Control Center in Hyderabad: హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని చేయాలని భావించి ప్రత్యేక చర్యలు చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.  బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. కమాండ్ కంట్రోల్‌లో ఉండే అధికారులు విధులు, ఇతర అంశాలపై సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకూడదు అని ఆదేశించారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే యువతపై డ్రగ్స్, మత్తు పదార్థాలు తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. 


నార్కోటిక్స్ బ్యూరోకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలు అరికట్టడంతో పాటు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి చర్యలు తీసుకోవడంపై చర్చించారు. ఇటీవల బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. టాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించారని బెంగళూరు పోలీసులు ప్రకటించడంతో ఈ సమీక్షపై ఉత్కంఠ నెలకొంది.