Telangana CM Revanth Reddy offers Deputy CM Post to Akbaruddin Owaisi | హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శనివారం చర్చ వాడివేడిగా జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని డిప్యూటీ సీఎంను చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌కు మెట్రో రైలును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నగరంలో మెట్రో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మైట్రో రైలును నిర్లక్ష్యం చేసింది. మేం హైదరాబాద్‌కు తీసుకురాగలిగాం. కానీ గత ప్రభుత్వం ఓల్డ్ సిటీకి మెట్రోను తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. అసెంబ్లీ వేదికగా మాటిస్తున్నాను. ఈ ప్రభుత్వం గడువు ముగిసేలోగా ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొస్తాం. మెట్రోలోనే వచ్చి ఓల్డ్ సిటీలో ఓట్లు అడుగుతాం. ఒకవేళ అలా జరగని పక్షంలో వచ్చే ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కాంగ్రెస్ తరఫున కొడంగల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయిస్తాం. కాంగ్రెస్ బీఫారమ్ మీద పోటి చేయించి, అక్బరుద్దీన్ ను గెలిపించుకుంటాం. ఆపై డిప్యూటీ సీఎంగా పదవిలో కూర్చోబెడతాం’ అని వ్యాఖ్యానించారు.
ఓల్డ్ సిటీకి మెట్రో రైలు తీసుకొస్తానని రేవంత్ హామీ
‘బీఆర్ఎస్ దోస్తులకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. ఈ నాలుగేళ్లలోనే చంద్రాయణ్ గుట్టకు (ఓల్డ్ సిటీకి) మెట్రో రైలు తీసుకొస్తాం. మెట్రో రైలులో వచ్చి ఓట్లు అడిగేలా చేస్తాం. ఒకవేళ మెట్రో రైలు తీసుకురాకపోతే.. ఒకవేళ ఇష్టం అంటే, కొడంగల్ సీటు అక్బరుద్దీన్ ఒవైసీకి ఇప్పిస్తా. చాంద్రాయణ్ గుట్టలో కాదు మా దోస్త్ అక్బరుద్దీన్ కు నా బీ ఫారమ్ ఇచ్చి కొడంగల్ నుంచి పోటీ చేపిస్తాం. అక్కడ గెలిపించుకుని అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టే పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. ఇందులో ఏ సందేహం వద్దు. ఫలక్ నుమా నుంచి చాంద్రాయణ్ గుట్ట వరకు రూ.2675 కోట్లు ఖర్చు పెట్టి మెట్రో రైలు పూర్తి చేస్తాం. భూ సేకరణ ప్రక్రియ సైతం జరుగుతోంది. గౌలిగుడ బస్టాండ్ నుంచి ఫలక్ నుమ, ఫలక్ నుమ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైలు తీసుకొచ్చి చూపిస్తామని’ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం ఎమ్మెల్యే అకర్బరుద్దీన్ కు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ భారీగా చర్చ జరుగుతోంది.