Revanth Reddy Inspects Flood affected areas in Hyderabad | హైదరాబాద్: భారీ వర్షాల సమయంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, కాలనీల ప్రజలు వరద నీటితో ఇబ్బంది పడుతున్నారు. మైత్రీవనం ప్రాంతాల్లో, బల్కంపేట ప్రాంతంలోని బుద్ధనగర్, గంగుబాయి బస్తీల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమీర్‌పేట బుద్ధ నగర్ లో జశ్వంత్ అనే ఓ బాలుడు సీఎం రేవంత్ రెడ్డికి తమ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న వరద సమస్యలను వివరించి శభాష్ అనిపించుకున్నాడు. భారీ వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన కార్యచరణపై అధికారులకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
పుస్తకాలు తడిచిపోయాయని సీఎంకు చెప్పిన బాలుడు
7వ తరగతి చదువుతున్న బాలుడు జశ్వంత్ సీఎం రేవంత్ రెడ్డికి స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాడు. జశ్వంత్ భుజంపై చేతులు వేసి ఓ స్నేహితుడిగా కాలనీలో తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి బాలుడ్ని అడిగి తెలుసుకున్నారు. వరద నీరు ఇంట్లోకి రావడంతో తన పుస్తకాలు మొత్తం తడిచిపోయాయని బాలుడు సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. ఆ ఏరియాలో వరద నీరు వచ్చే ప్రాంతంలో గేట్ లాంటివి ఏర్పాటు చేయడంపై ఆలోచించాలని అధికారులకు సీఎం సూచించారు. కొన్నిచోట్ల డ్రైనేజీ పైప్ లైన్ కంటే కిందకు ఇండ్లు ఉన్నాయని ఈ సమస్య త్వరగా పరిష్కరించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. తమ కాలనీకి వచ్చి స్వయంగా వరద నీటి సమస్య, ముంపు సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయడంపై ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎంతో మాట్లాడానంటే కాలనీవాళ్లు నమ్మలేదు..
సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తమ కాలనీ సమస్యలు తెలిపిన బాలుడు జశ్వంత్ తన అనుభవాలు షేర్ చేసుకున్నాడు. తాను సీఎంతో మాట్లాడి తమ సమస్యలు చెప్పానంటే మొదట ఇది చూడని వాళ్లు ఎవరూ నమ్మలేదన్నాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో తాను మాట్లాడి, సమస్యలు వివరిస్తానని అస్సలు ఊహించలేదన్నాడు. నా పేరేంటని సీఎం సార్ అడిగారు. ఏ క్లాస్ చదువుతున్నావని అడిగారు. తరువాత మా కాలనీ సమస్యలు అడిగితే.. వర్షాల సమయంలో ఇబ్బంది ఎక్కువగా ఉందని, ఇండ్లలోకి వరద నీరు వస్తుందని చెప్పినట్లు జశ్వంత్ వివరించాడు. అధికారులకు చెప్పి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, భవిష్యత్తులో ఆ కాలనీలకు వరద ముప్పు లేకుండా చూస్తామని సీఎం తనతో చెప్పారని బాలుడు పేర్కొన్నాడు. సీఎంతో మాట్లాడటం ఊహించలేదని, కొత్త అనుభవంలా ఉందన్నాడు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి అమీర్ పేట, బల్కంపేట ప్రాంతంలోని బుద్ధనగర్, గంగుబాయి బస్తీలు, మైత్రీవనం ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఆ బస్తీల్లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి... భారీ వర్షాల సమయంల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.