Telangana Rains | హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి రెండు గంటలపటు కురిసిన వర్షానికే హైదరాబాద్‌లో పలు చోట్ల 100 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదు అయింది. ఆగస్టు నెలలోనే ఈ స్థాయిలో భారీ వర్షాలు కురవడం ఇది మూడోసారి. నేడు సైతం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ నగరానికి హెచ్చరిక జారీ చేశారు.
ఆదివారం మధ్యాహ్నాం 1.45 - 2.45 గంటల సమయంలో ఉప్పల్, బోడుప్పల్, కాప్రా, మల్కాజ్‌గిరి, నాగోల్, ఎల్‌బి నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నేటి రాత్రి వరకు నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందేని.. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లవద్దని జీహెచ్ఎంసీ అధికారులు సైతం సూచిస్తున్నారు. మధ్యాహ్నం 2.45PM నుండి 6PM వరకు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి..
తదుపరి 5 గంటలు, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. చాలా ప్రదేశాలలో వర్షపాతం 30- 60mm మధ్య నమోదు కావొచ్చు. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి - భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల తదుపరి 3 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైనే బయట తిరగాలని సూచించారు.
జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్
ఆదివారం మధ్యాహ్నం నుంచి ఐదారు గంటల పాటు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదివరకే కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైందని అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల వరకు భారీ వర్షాలు కరుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా అవసరం ఉంటే GHMC Helpline: 040-21111111 / 100 లలో సంప్రదించాలని సూచించారు. రాత్రి 9 దాటిన తరువాత నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఈ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ..
వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దాని ప్రభావంతో తెలంగాణలో ఆదివారం నాడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ అయింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.