Telangana News | హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని దశాబ్దాలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ దగా చేస్తుంటే, ప్రజల్ని వంచిస్తుంటే బీజేపీ అద్భుతంగా పోరాటం చేసిందన్నారు గువ్వల బాలరాజు (Guvvala Balraj ). బీజేపీ వైపు నేను చూస్తుంటే కొందరు అసత్యాలు చెప్పారు. బీజేపీ కేవలం కొన్ని సామాజిక వర్గాల వారిని ప్రోత్సహిస్తుందని, అవకాశాలు ఇస్తుందని చెప్పారు. కానీ ఎంతో పరిశోధన చేసిన తరువాత తేలింది ఏంటంటే.. ఎంతో మంది కరుడుగట్టిన దేశభక్తి కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు బీజేపీ వైపు చూడటానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi). దేశంలో ప్రతి పేదవాడికి గౌరవం, సంక్షేమం కలగాలని ఎన్డీయే పాలిస్తోంది. బయటి దేశం నుంచి వచ్చిన వారిని మన దేశం, జాతి మీద రుద్దేందుకు కాంగ్రెస్ పార్టీ చూసిందన్నారు.
జయశంకర్ ఆశయాల కోసం టీఆర్ఎస్‌లో..
హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచందర్ రావు సమక్షంలో గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేసిన తరువాత మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదే స్ఫూర్తితో దేశం కోసం పనిచేద్దాం. రాష్ట్ర సాధనలో కుల సంఘాలు, ప్రజా సంఘాలు పనిచేశాయి. విద్యార్థి నేతగా చేయని నేను టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ కోసం పనిచేశాను. దళితుల గురించి మాట్లాడేందుకు మాత్రమే నాకు ఛాన్స్ ఇచ్చారు. దళితుల అంశాలను ఖండించేందుకు మాత్రమే బీఆర్ఎస్ నన్ను వాడుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం, ఆయన విధివిధానాల కోసం గులాబీ పార్టీలో కొనసాగాను. అవకాశాలు ఇవ్వకపోవడం, దళితులకు సరైన ప్రాధాన్యం లేకపోవడంతో విసిగిపోయాను. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసమే బీజేపీలో చేరాను. న్యాయవాదిగా చేసిన నాకు రామచందర్ రావు గారితో అనుబంధం ఉంది. క్షేత్రస్థాయి నాయకత్వం బీజేపీలో ఉంది. దేశం కోసం పనిచేసే వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు.
తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన అచ్చంపేట ప్రజలు, అన్ని సంఘాలకు క్షమాపణ చెప్పాను. బీఆర్ఎస్ ఎప్పుడూ ఎన్నికల కోసం సిద్ధంగా ఉంటుంది. నేను సొంతంగా ఏమైనా చేయాలనుకుంటే, ఎవరితోనైనా చర్చిస్తే బీఆర్ఎస్ ప్లాన్ బీ సిద్ధం చేసుకుంటుంది. పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేస్తుంది. పొగబెడుతుంది. అందుకే ఎవరికి చెప్పకుండా రాజీనామా చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత అందరితో చర్చించి రెండు పార్టీలలో అవకాశాలు వచ్చినా.. బీజేపీ వైపు మొగ్గు చూపాను.
సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేస్తాను..అవినీతిరహిత పాలన కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో నిఖార్సైన కార్యకర్తగా పనిచేస్తాను. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, విప్ గా పనిచేశాను. ఇప్పుడు నాకు పదవులు కొత్త కాదు. 2004లో పోటీచేస్తే మా జిల్లాకు చెందిన ఆ పెద్ద నేతకు 6 వేల ఓట్లు వచ్చాయి. తరువాత ప్లానింగ్ బోర్డులో చైర్మన్ అయ్యారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అని చెప్పారు. లక్ష ఓట్లు తెస్తాడని కేసీఆర్ అన్నారు. కానీ 2 రోజుల్లోనే నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇస్తే మాట మాట్లాడలేదు. పోటీ చేసి ఓడిపోయాను. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేశారు. నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్న నా నియోజకవర్గానికి ఎవరూ వచ్చి ప్రచారం చేయలేదు. కానీ 3 లక్షల 80 వేల ఓట్లు సాధించాను. అదే కేసీఆర్ పోటీ చేసిన చోట పాలమూరు, ఓయూ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను తీసుకెళ్లి విజయం సాధించారు. నాకు అలా చేసింటే 31 ఏళ్లకే 2009లో ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టేవాడ్ని.
తెలంగాణ తొలి సీఎంగా దళితుడ్ని చేస్తానని కేసీఆర్ అన్నారని టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో చర్చించి కేసీఆర్ ను మా సీఎంగా ఎన్నుకున్నాం. కానీ అప్పుడు మేం మాత్రం సీఎం సీటు బిక్షం వేశామని అంటే ఎలా ఉంటుంది. పార్టీ మారతుంటే బచ్చాగాడు అని కేటీఆర్ అంటున్నారు. నాకంటే ఒక ఏడాది పెద్దవాడు అయి ఉండొచ్చు. తొలిసారి ఎమ్మెల్యేగా అతికష్టమ్మీద కేటీఆర్ వందల ఓట్ల తేడాతో నెగ్గారు. కానీ వలసకూలి బిడ్డ ఎంపీగా లక్షల ఓట్లు సాధించాడని గుర్తుంచుకోండి. నా సతీమణి ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధింపుల వల్ల ఆమె కుంగిపోయారు’ అని గువ్వల బాలరాజు అన్నారు.
బీజేపీలో చేరకమేందే కేటీఆర్‌కు వార్నింగ్..అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరికకు ముందే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తనకంటే పెద్దోడేమీ కాదన్నారు. ఎదిగిన సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన విదేశాల్లో చదువుకున్నాడు, ఆయనలా నేను స్పీచ్ ఇవ్వకపోవచ్చు. కానీ ప్రజల కోసం పనిచేయడంతో నాకున్న అనుభవం కేటీఆర్‌కు లేదు. ఆకలిబాధలు తెలిసివాడ్ని నేను. ఆకలికేకలు బయటకు తీయడం మొదలుపెడితే కేటీఆర్‌ను గ్రామాల్లో కూడా అడుగుపెట్టనివ్వను అని గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.