Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య స్టేచర్‌పై చేసిన కామెంట్స్ ఎంత సంచలనం కలిగించాయో చూశాం. ఇప్పుడు అదే అంశంపై సభలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. తాను చెప్పిన విషయాన్ని తప్పుగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ప్రతిపక్షంలో ఉండాలని ఆకాంక్షించారు. 


గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి చాలా అంశాలపై స్పందించారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓడించిన ప్రజలే తప్పు చేశారని బీఅరెస్ నేతలు అంటున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను తప్పు పట్టడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు వాళ్ల స్టేచర్‌పైన ఉన్న ఆలోచన తెలంగాణ ఫ్యూచర్ పైన లేదా అని నిలదీశారు.ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీఆరెస్ మార్చురీలో ఉందని తాను మాట్లాడినట్టు వివరణ ఇచ్చారు. దాన్ని కేసీఆర్‌ను అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు కేసీఆర్‌ను అనేంత కుంచిత బుద్ది తనకు లేదన్నారు. కేసీఆర్ 100 సంవత్సరాలు ఆరోగ్యంతో బతకాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ ప్రతిపక్షంలో అక్కడ అలాగే ఉండాలి.. మేం అధికారపక్షంలో ఇక్కడ ఇలాగే ఉంటామని అభిప్రాయపడ్డారు.  కెసీఆర్ సభలో ఉండి వారి అనుభవంతో సూచనలు ఇస్తే వాటిని తీసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు రేవంత్.  


నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పుకుంటున్నవాళ్ళు పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయలేదని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పుకొచ్చారు. వాళ్ల హయాంలో 22.9 శాతం ఉన్న నిరుద్యోగ సమస్యను … 18.1  శాతానికి తగ్గించిన చరిత్ర తమదని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని యూనివర్శిటీ వీసీల నియామకం సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశామన్నారు. వీసీ లిస్టు తీద్దాం.. మేం సామాజిక న్యాయం చేసింది నిజమో కాదో చూద్దామన్నారు. విలాసవంతమైన జీవితాలకు భంగం కలిగించానని వాళ్లకు కోపం ఉండొచ్చన్నారు రేవంత్. కానీ కుల దురహంకారం ప్రదర్శించడం న్యాయమా? అని ప్రశ్నించారు. గవర్నర్, స్పీకర్‌లను గౌరవించరు… ఏకవచనంతో సంభోదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని సమర్థించుకుంటూ ధర్నాలు చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు.. దావత్‌లు ఇచ్చే దోస్తులేనా బీఆరెస్‌కు కావాల్సిందీ అని నిలదీశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆరెస్‌కు పట్టదా అని ఆందోళన వ్యక్తం చేశారు.  


రైతు సమస్యలపై కేసీఆర్‌తో ఎపుడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో మహిళలు ఇంటిబిడ్డగా తనను చూసుకుంటున్నారని అన్నారు. ఆడ బిడ్డలకు స్వేచ్ఛ కల్పించాలని ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. "రూ. 500లకే  గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. 5000  స్కూల్స్ ను బీఆరెస్ మూసివేసింది. స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యత మహిళా సంఘాకు ఇచ్చాం. 1000 ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చాం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చాము." అనితెలిపారు. 


బతుకమ్మ చీరల పేరుతో దోపిడీ చేశారని వాటిని రద్దు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నామని వెల్లడించారు. కోటి 30 లక్షల చీరలు నేతన్నలకు ఆర్డర్ ఇచ్చామని వివరించారు. ఒక భావోద్వేగంతో తెలంగాణను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.