Revanth Reddy comments on Godavari Banakacherla : తెలంగాణ రైతులు, నీళ్ల విషయంలో ఎవరితో కూడా రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై జరుగుతున్న రాజకీయ రగడపై ఆయన ప్రత్యేకంగా అఖిల పక్షం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు జీవనాధారమైన గోదావరి, కృష్ణా నదుల విషయంలో ఎవరితోనైనా కోట్లాడతామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు సలహా సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

గోదావరి మిగులు జలాల విషయంపై మొదట ఉప్పు అందించింది కేసీఆర్ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 2016లో ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లిలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారని అన్నారు. ఏటా గోదావరి నుంచి 3వేల టీఎంసీల నీరు వృథాగా పోతుందని చెప్పారని అన్నారు. దీనికి సంబందించిన డాక్యుమెంట్స్‌ను ఎంపీల ముందు ఉంచారు. అంతే కాకుండా అక్కడి మూడేళ్ల తర్వాత 2019లో జగన్‌తో సమావేశమై ఈ విషయంపై చర్చోపచర్చలు జరిపారని గుర్తు చేశారు. నేటి బనకచర్లకు నాడే అంకురార్పణ కేసీఆర్ చేశారని తెలిపారు. 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాయలసీమను ససశ్యామలం చేస్తామంటూ కూడా మీడియాకు కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన బీఆర్‌ఎస్ అనుకూల మీడియా వేసిన వార్తలను ఎంపీలకు సూచించారు. నాడు సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తోంది. కానీ తాము మాత్రం ఊరికే ఉండటం లేదని బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకునేందుకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని ఓ తీర్మానం చేయాలని కూడా నిర్ణయించామన్నారు. టెక్నికల్‌గా, పొలిటికల్‌గా ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్టును ముందుకు కదలనీయకుండా చేస్తామని తెలిపారు. కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. దీనికి అన్ని పార్టీల ఎంపీలు సలహాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  

రేవంత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర మధ్య వాగ్వాదం 

బనకచర్లు-గోదావరి ప్రాజెక్టు ఆధ్యుడు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తప్పుపట్టారు. ప్రాజెక్టును ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఆలోచన చేయాల్సిన టైంలో రాజకీయ విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. ఇది రాజకీయ విమర్శలు కాదని అసలు దీని బ్యాక్‌ గ్రౌండ్ చెబుతున్నానని సీఎం వివరించారు. దీనిని వ్యతిరేకిస్తూ తాము వాకౌట్ చేస్తున్నామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పి బయటకు వచ్చేశారు. 

సెక్రెటేరియేట్‌లోని మినిస్టర్ ఉత్తమ్ కుమార్ ఛాంబర్‌లో తెలంగాణ అన్ని పార్టీల ఎంపీలతో సమీక్ష సమావేశం జరిగింది. సమవేశం ప్రారంభంలో గోదావరి-బనకచర్లపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌తో తెలంగాణకు ఉన్న ఇబ్బంది ఏంటి?, ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి?, ప్రాజెక్ట్ ఆపేలా కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? అనే పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు.