Ramoji Rao Passed Away: మీడియా దిగ్గజం ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






తెలుగువారందరికి గర్వకారణం
ఈనాడు వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్త రామోజీరావు మరణం తనను ఎంతో బాధించిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణంగా నిలిచారని, ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని పేర్కొన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు.






అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు
ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీ రావు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.


చంద్రబాబు దిగ్భ్రాంతి
రామోజీ రావు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రామోజీ రావు ఆరోగ్యంగా తిరిగి వస్తామని తామంతా భావించామని కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు. రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని, ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..
తెలుగురాష్ట్రాల ప్రజలకు రామోజీరావు అత్యంత సుపరిచితం. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామోజీ రావు ఈనెల 5న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం 4.50 నిమిషాలకు ఆయన తుదిశ్వాస  విడిచారు. ఈ మేరకు ఈనాడు సంస్థ అధికారిక ప్రకటన చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. 1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడి అనే చిన్నగ్రామంలో జన్మించిన రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగారు. అన్నదాత, మార్గదర్శి, ఈనాడు పత్రికలతో ఆయన తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు.