Revanth Reddy : రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువ పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారని వివరించారు. అందుకే రైతులు ఈసారికి వర్షాధార పంటలు ఎక్కువ వేయొద్దని సూచించారు. పంటమార్పిడి గురించి ఆలోచించాలని హితవుపలికారు. నిపుణుల సూచనల మేరకు పంటలు వేయాలని అందుకు తగ్గట్టు విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 

Continues below advertisement

వర్షాలు ఎక్కువగా పడటం లేదని నిపుణుల సూచనల మేరకే తాను ఇలాంటి పిలుపునిచ్చానని, దీన్ని కూడా బీఆర్ఎస్ వాళ్లు రాజకీయం చేస్తారని రేవంత్ మండిపడ్డారు. అన్ని సక్రమంగా ఉన్నప్పుడే వరి వేస్తే ఉరి అంటూ స్టేట్మెంట్‌లు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. దీనిపై ఎంత దుష్‌ప్రచారం చేసినా నమ్మొద్దని రైతులకు సూచించారు. ఆ కుటుంబానికి అబద్దాలు చెప్పాలనే శాపం ఉందని ఎద్దేవా చేశారు. వారు నిజాలు చెబితే తలలు వేయి ముక్కలు అవుతాయిని అందుకే వారు ఎప్పుడూ నిజం చెప్పలేరని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు రోడ్డున పడతారని ఎన్నికల్లో ప్రచారం చేశారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన మేలు మాత్రం రైతులు గుర్తు పెట్టుకున్నారని రేవంత్ అన్నారు. దేశంలో ఉచిత విద్యుత్‌ ప్రారంభించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. అదే స్ఫూర్తితో నేడు కూడా రైతులకు మేలు చేయాలని పథకాలు తీసుకొచ్చామని వివరించారు. ాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతులకు, ఉద్యోగులకు కష్టం రాకుండా చూస్తున్నామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణను అప్పులు పాలు చేసిన కేసీఆర్‌ బ్యాచ్‌ నిత్యం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. 8.11 లక్షల కోట్ల అప్పతో అధికార బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కా రాజీ పడకుండా అన్ని వర్గాలకు మేలు చేస్తున్నామని వివరించారు. నాడు ఒక కుటుంబం చేసిన అప్పు కారణంగా మరింత మేలు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.  పదేళ్లు అన్ని వర్గాలను వంచించి ఒక కుటుంబమే ఆర్థికంగా ఎదిగిందని రేవంత్ ఫైర్ అయ్యారు. లెక్కలు తీస్తే భారీగా అప్పులు వెలుగు చూశాయని చెప్పుకొచ్చారు. అన్ని శాఖాల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టారని , ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా 1వ తేదీన ఇవ్వలేక వాయిదా పద్ధతుల్లో ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే అంతకంటే దారుణమైన పాలన ఉంటుందని హెచ్చరించారు. అరుంధతి సినిమాలో పశుపతిని బంధించినట్టు కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో ప్రజలంతా బంధించారని, మళ్లీ అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఎంతటి విధ్వంసం ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. 

Continues below advertisement