Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాజేంద్రనగర్(Rajendranagar)లోని వ్యవసాయ వర్సిటీ(Agriculture University)లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటిన ఆయన ప్రతి మహిళ కూడా ఇంట్లో పెరడులో రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మీ రాజకీయ జీవితాన్ని మొక్కలు నాటడంతో ప్రారంభించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయని మహిళళకు 50కు పైగా సీట్లు వస్తాయని తెలిపారు. తాను మాత్రం ప్రత్యేక చొరవ తీసుకొని 60 సీట్లు మహిళలకు ఇప్పించి గెలిపిస్తానని చెప్పుకొచ్చారు.
'18 కోట్ల మొక్కల నాటడమే లక్ష్యం'
మొక్కలు నాటి వనాలు ఏర్పాటు చేసినప్పుడే అభివృద్ధికి విలువ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే తెలంగాణను పచ్చని వానాలకు కేరాఫ్ అడ్రెస్‌కుగా చేసేందుకు 18 కోట్ల మొక్కలు నాటే యజ్ఞం చేపట్టామన్నారు. "వనమహోత్సవం మంచి కార్యక్రమం, మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది. వనమే మనం మనమే వనం అన్నారు పెద్దలు. వనం పెంచినప్పుడే అభివృద్ధి పథం వైపు నడుస్తాం. అందుకే ఇవాళ అటవీ శాఖ ఆధ్వర్యంలో 18 కోట్ల మొక్కలు నాటాలని బృహత్తర కార్యక్రమం తీసుకున్నారు. "
'అమ్మ తలచుకుంటే తెలంగామ హరితవనం అవుతుంది'
అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని రేవంత్ గుర్తు చేశారు. అదే తల్లులు రెండేసి మొక్కలు నాటితే కచ్చితంగా తెలంగాణ హరితవనంగా మారుతుందని ఆకాంక్షించారు. "మహిళలు, విద్యార్థులు, అధికారులు, మంత్రులు అందరూ వన మహోత్సవ కార్యక్రమంలో భాగమయ్యారు. అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని చెల్లెళ్లను విజ్ఞప్తి చేస్తున్నాను. పెరుడులో రెండు చెట్లు పెంచితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అమ్మ పేరు మీద మొక్కలు నాటాలని ప్రధానమంత్రి అన్నారు. అదే తల్లి కూడా రెండు మొక్కలు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరితవనం అవుతుంది. ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది. అమ్మ పర్యవేక్షణలో ఏం చేసినా రక్షణ ఉంటుంది."
'మహిళలకు కీలక బాధ్యతలు అప్పగింత'
మహిళలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించా విజయం వరిస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి. అందుకే ప్రజాపాలనలో అన్నీ మహిళల కేంద్రంగానే చేపడుతున్నట్టు తెలిపారు. వ్యాపారాల్లో కూడా మహిళలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. " అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామాల్లో పాఠశాలల నిర్వహణ బాధ్యత ఆడబిడ్డలకు అప్పగించాం. విద్యార్థుల అటిండెన్స్ ఉపాధ్యాయులు తీసుకుంటే గురువుల వచ్చారో లేదో మహిళలు చూస్తున్నారు. ఒకప్పుడు సోలార్ వ్యాపారం పెట్టాలంటే అదానీల వైపు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు వాటిని స్వయం సహాయక సంఘాలకు ఇచ్చం. ఇవాళ ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అమ్మవారి ఇంటికి వెళ్లాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా కుమారుడికో భర్తకో డబ్బులు అడగాల్సి వచ్చేది. ఇప్పుడు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇలా ప్రయాణం చేయడమే కాదు... ఆడబిడ్డలే ఆర్టీకి కిరాయి బస్‌లు ఇస్తున్నారు."
'ఇందిరా మహిళా శక్తి కేంద్రం చూసి రండి'
హైటెక్ సిటీ అంటే విప్రో, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు గుర్తుకు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి. కానీ హైటెక్ సిటీకి మించేలా మహిళలకు భారీ స్థలం కేటాయించి వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు అందించామన్నారు. మడు ఎకరాల స్థలం ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను అమ్మేందుకు అవకాశం కల్పించామన్నారు. " ఇవాళ హైటెక్ సిటీ అంటే విప్రో . మైక్సోసాఫ్ గుర్తుకు వస్తాయి. కానీ అక్కలకు మూడున్నర ఎకరాలలో స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి పేరుతో అప్పగించాం. అక్కడ వారి తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. ఎందుకో మీడియా దీనిపై దృష్టి పెట్టడం లేదు. మొన్న నిర్వహించిన భారత్ సమ్మిట్‌కు వచ్చిన ప్రపంచ స్థాయి ప్రతినిధులు అక్కడకు వెళ్లారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారంతా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నారని అభినందించారు."
'డ్వాక్రా సంఘాల్లో చేరండీ లక్షాధికారులు అవ్వండి'
రాష్ట్రంలో మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు రేవంత్ రెడ్డి. దీనికి మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 65 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయని వీటిని కోటికి పెంచాలని సూచించారు. వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయితీలు ఇచ్చి కోటీశ్వరులను చేస్తామన్నారు రేవంత్. "స్వయం సహాయక సంఘాలు 65 లక్షళ మంది ఉన్నారు. దీన్ని కోటికి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో 18 ఏళ్ల పైబడి 60 ఏళ్ల లోపు ఉన్న వాళ్లకే ఈ సంఘాల్లో చేరే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వయసును 17 ఏళ్లకు తగ్గించాం. 17ఏళ్లకుపైబడిన వాళ్లు ఎవరైనా మహిళలు ఈ సంఘాల్లో చేరొచ్చు. పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు తక్కువగా ఉన్నాయి. తెలిసిన వారందర్నీ సంఘాల్లో చేర్చాలని రిక్వస్ట్ చేస్తున్నాను."
'సీఎం తినే బియ్యం మహిళలకు ఇస్తున్నాం'
ఆత్మగౌరవంతో బతికేందుకు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు రేవంత్. గత పదేళ్లు మహిళల గురించి పట్టించుకున్న వారు లేరని వాపోయారు. "ఆడబిడ్డలకు సన్నబియ్యం ఇస్తున్నాం. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఏ బియ్యం తింటున్నారో అవే ఇస్తున్నాం. ఆడబిడ్డలను మేలు జరగాలని ఆత్మగౌరవంతో బతకాలని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం. పదేళ్లు ఏనాడు ఆడబిడ్డలను పట్టించుకోలేదు. ఐదేళ్లు మంత్రివర్గంలో వారికి స్థానమే లేదు. ఈ మీటింగ్‌లో ఆడబిడ్డలు కూర్చొని ఉంటే మగవారు నిలబడే ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇలానే ఉంటుంది."
'రిజర్వేషన్లు వస్తున్నాయి రెడీగా ఉండండి'
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 60మంది మహిళలు అసెంబ్లీలో కూర్చుంటారని రేవంత్ తెలిపారు. అందుకు తగ్గట్టుగా మహిళలు నాయకులుగా ఎదగాలని అన్నారు. ఇంట్లో రెండు మొక్కలు నాటి రాజకీయ నాయకులుగా ఎదిగే కార్యచరణకు శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. " ఇందిరమ్మ ఇచ్చిన రిజర్వేషన్లు ఫలితంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు చోటు లభించింది. చాలా మంది నాయకులుగా ఎదిగేందుకు దారి దొరికింది. ఇప్పుడు తొందరలో ఎమ్మెల్యేలకు రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో చట్టప్రకారం 50కిపైగా సీట్లు మహిళలకు వస్తాయి. నేను ప్రత్యేక చొరవ తీసుకొని 60 సీట్లు ఆడబిడ్డలకు ఇప్పిస్తాను. మంచి పేరు తెచ్చుకోండి. ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇల్లు నడిపిన వాళ్లు ప్రభుత్వాలు బాగా నడుపుతారు. చెట్లు నాటడంతోనే ఈ ప్రక్రియను మొదలు పెట్టండి. రెండు చెట్లైనా నాటండి. అని పిలుపునిచ్చారు.