Telangana Cabinet Decisions: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర భవిష్యత్‌పై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీలో పారిశ్రామిక అభివృద్ది, ప్రజా సంక్షేమం, వ్యవసాయం, విద్యారంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అటు సామాన్యులకు ఊరటనిచ్చేలా, ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగుల పెట్టించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Continues below advertisement

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2.0

తెలంగాణను గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డెస్టినేషన్‌గా మార్చే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్‌ 2.0 నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మెగా సదస్సును ఈ ఏడాది డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈసారి ఇన్వెస్ట్‌ తెలంగాణ అనే ప్రధాన నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందో. ముఖ్యంగా డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మా రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. సదస్సు విజయవంతం కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్‌ కుమార్, వివేక్ వెంకటస్వామిలతో కూడిన ప్రత్యేక సబ్‌కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను ప్రపంచానికి ఆవిష్కరించనుంది. 

సామాన్యులకు స్మార్ట్‌ రేషన్ కార్డు 

రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది. పాత కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3 కోట్లకుపైగా రేషన్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. నిరుపేదలకు పారదర్శకంగా సరకులు అందేలా ఈ స్మార్ట్ కార్డులను రూపొందించారు. 

Continues below advertisement

హైదరాబాద్‌లో ఈవీ ఆటోలు భారీ ఊరట

హైదరాబాద్‌ సిటీని గ్రీన్ సిటీగా మార్చే దిశగా కేబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్‌ కోసం 200 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 18, 766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఈవీలుగా మారుస్తారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు ఒక్కో వాహనానికి గరిష్టంగా 1, 50, 000 సబ్సిడీ అందజేయనున్నారు. ఇది పాత ఆటోలకు ఈవీ కిట్లు అమర్చుకోడానికి లేదా పాతవి స్క్రాప్ చేసి కొత్త ఈ-ఆటోలు కొనడానికి వర్తిస్తుంది. 

సన్న వడ్లకు 500 రూపాయల బోనస్‌

రైతులకు ప్రోత్సహించే దిశగా కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలంలో పంట 7 రకాల సన్నధాన్యాలకు క్వింటాకు ఐదు వందల బోనస్ చెల్లించాలని నిర్ణయించారు. మిగులు ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కేంద్రం తీసుకోగా మిగిలిన 17. 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి కనీస ధర క్వింటాలుకు రూ.2,389గా నిర్ణయించారు.   

రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా విద్యాసంస్థల నిర్వహణలో మార్పులు చేశారు. రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలను ఇకపై యంగ్ ఇండియా స్కిల్స్‌  యూనివర్శిటీ పరిధిలోకి తీసుకురానున్నారు.  ఆదిలాబాద్‌, గజ్వేల్‌, దుబ్బాక వంటి ఏడు నియోజకవర్గాల్లో కొత్తగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. దీంతో మొత్తం స్కూల్స్‌ సంఖ్య 86కు చేరింది. 

ఇతర నిర్ణయాలు 

మక్తల్-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్‌ -2 పనుల కోసం రూ. 2100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా లక్ష ఎకరాలు సాగునీరు అందనుంది. హైదరాబాద్‌లో కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సంబంధించిన దరఖాస్తు గడువును అక్టోబర్‌ 31 వరకు పొడిగించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో టీడీఆర్‌ సర్టిఫికేట్ల జారీ, వినియోగంపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులను జారీ చేసింది.