హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ సమావేశాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం ముగిసిన తరువాత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. ఈ నెల 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గర్నవర్ తమిళిసై ప్రసంగంతో మొదలైన తాజా సెషన్ 12వ తేదీన ముగిసింది. ఈసారి బడ్జెట్ సమావేశాలు మొత్తం 56 గంటల 25 నిమిషాల పాటు కొనసాగాయి.
ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. ఈ నెల 6న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.90 లక్షల కోట్ల మేర 2023 -24 వార్షిక బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజు గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభలో చర్చ జరిగింది. తాజా సమావేశాల చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీష్ రావు ద్రవ్య వినియమ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలలో పలు బిల్లులు, తీర్మానాలు, తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు, నిధుల వినియోగం, ఖర్చులపై కీలకంగా చర్చ సాగింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, అక్షరాస్యత తదితర అంశాలపై సంబంధిత నేతలు సమాధానాలు ఇచ్చారు. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లును మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
ప్రతి ఇంటికి కృష్ణా, గోదావరి జలాలు వస్తున్నాయని.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు కేసీఆర్. రాష్ట్రంలో కాలువల్లో నీళ్లు ఎలా పారుతున్నాయో... రేపు ఎన్నికల్లో కూడా ఓట్లు పారుతాయని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను సభలో ఎండగట్టారు కేసీఆర్. దేశంలో రాజకీయ మార్పులు ఎందుకు అవసరం ఉందన్నది పలు విషయాలను ప్రస్తావిస్తూ తన ప్రసంగంలో వివరించారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
మోదీ గెలిచారు, దేశం ఓడింది
"మన్మోహన్ సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసింది. మోదీ కంటే మన్మోహన్‌సింగ్ ఎక్కువ పనిచేశారు. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోదీకి ఓటేశారు. పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. మోదీ గెలిచారు దేశం ఓడింది. మన్మోహన్ కన్నా మోదీ పాలనలో దేశం ఎక్కువ నష్టపోయింది. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది? నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని అంటూ మోదీ, రాహుల్ గొడవపడుతున్నారు. దేశం పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే మోదీ మాట్లాడరు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?. మనకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారు. మావి మాకు ఇవ్వాలని ఏడేళ్ల నుంచి అడుగుతున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మోదీ దిల్లీకి కూడా నీళ్లు ఇవ్వడం లేదు. పరిశ్రమలు మూతబడుతున్నాయ్.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది?" -సీఎం కేసీఆర్