ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రూ. 10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరయితే, అంతా బాగేనే ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై అదానీ కంపెనీలపై దర్యాప్తు చేపట్టకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ కవిత సోమవారం శాసన మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు.


అదానీ షేర్లతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ షేర్ల పతనం.. 
దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీ సంస్థల షేర్ల విలువ దారుణంగా పడిపోతున్నా కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం దారుణం అన్నారు. అదానీ కంపెనీలతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి దిగ్గజ సంస్థల షేర్ల విలువ ఈ ఏడాది జనవరి 23వ తేదీ నుంచి భారీగా పడిపోయాయని, దాంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. రూ. 3600గా ఉన్న అదానీ షేర్ విలువ ఇప్పుడు దాదాపు రూ.1400కు పడిపోయిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. 


దాదాపు రూ. 10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరయితే అంతా బాగుందని కేంద్ర మంత్రి సీతారామన్ ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అదానీ షేర్ల పతనం, ప్రముఖ కంపెనీల షేర్ల విలువ పతనం కావడంపై దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ మద్దతుతోనే అదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచానికి తెలుసునని ఆమె అన్నారు. అదానీ వ్యవహారంపై ఎవ్వరు ప్రశ్నించినా అంతా బాగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రిజర్వు బ్యాంకు చెబుతున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వం మద్ధతుతో అదానీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో అందరికీ తెలుసన్నారు.






రాష్ట్ర బడ్జెట్ దేశానికి స్ఫూర్తిదాయకం..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాన్ని నిరుత్సాహపరచగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర బడ్జెట్ మాత్రం దేశానికి స్పూర్తినిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రూ. 2.9 లక్షల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశానికి స్పూర్తిగా నిలిచే అంశాలు ఈ బడ్జెట్లో ఎన్నో ఉన్నాయని వివరించారు. దామాషా ప్రకారం బడ్జెట్ ను కేటాయించామని, సామాజిక రంగంలో ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయని కవిత స్పష్టం చేశారు. 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను విస్మరించిందని విమర్శించారు. దేశంలో లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కోత విధించిందని, తక్షణమే ఆ పథకానికి నిధులను పెంచాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థలకు ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.