సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని తెలంగాణ బీజేపీ ఆరోపించింది. బాసరలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన ఆయన్ని మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే మీడియాతో మాట్లాడిన బండి సంజయ్... సికింద్రబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు.
తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణించాయన్నారు బండి సంజయ్. టిఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారు. హైదరాబాదులో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయస్థాయి సమావేశాలపై దృష్టి మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు సంజయ్. రైల్వే ఆస్తుల విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు బండి.
సికింద్రాబాద్‌లో ఆర్మీస్టూడెంట్స్ పేరు మీద కొందరు వ్యక్తులు వచ్చి రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం... ప్రయాణికులపై దాడులు చేయడం దారుణమన్నారు బండి సంజయ్. దీనికి ఆర్మీ విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం వాళ్లదేనన్నారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని నిలదీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వం ప్రేరేపించి చేసిన విధ్వంసమేనన్నారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదంటే... ఎవరి ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. కచ్చితంగా బుల్డోజర్ ప్రభుత్వం వస్తేనే ఇలాంటి వారి ఆటలకు అడ్డుకట్టపడుతుందన్నారు.
యువతకు అన్యాయం చేసే పని మోదీ ప్రభుత్వ చేయదన్నారు బండి సంజయ్. కచ్చితంగా వాళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని దేశ సేవ కోసం అగ్నిపథ్ తీసుకొచ్చారన్నారు. కావాలనే కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని... వాళ్ల ట్రాప్‌లో పడొద్దని యువతకు సూచించారు.
త్రిపుట్ ఐటీకి వెళ్తున్న బండి సంజయ్‌ను సుమారు అరగంటపాటు కార్‌లోనే ఉంచి పోలీసులు త్రిబుల్ ఐటీ కి వెళ్లొద్దు అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా త్రిపుల్ ఐటీకి వెళ్తానని బండి సంజయ్ తెలపడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను సిల్లి అని తీసేసిన సీఎం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఒక్క ట్రిపుల్ ఐటీని మెయింటెన్ చేయని సీఎం మిగతా విద్యాసంస్థలను ఏం మెయింటెన్ చేస్తారని అన్నారు సంజయ్. ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా.. టెర్రరిస్టులా.. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. విద్యార్థులకు భరోసా కల్పించేందుకే తాము వెళ్తే అడ్డుకున్నారన్నారు. బీజేపీని ఆపడం సీఎం తాత తరం కూడా కాదని అన్నారు.