తెలంగాణలో వెంటలేటర్‌పై ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ముందుగా కాపాడుకోవాలని కేసీఆర్‌కు సూచించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ భాష ఎలా ఉంటే తమ సమాధానం కూడా ఆ స్థాయిలోనే ఉంటుందన్నారు. ప్రధానమంత్రి అన్న మాట మరచి మోదీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారాని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఏం జరుగుతుందో అన్న విషయాన్ని పక్కనపెట్టి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు బండి సంజయ్. ఇక్కడే బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. వాటి సంగతి చూడాలని సలహా ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులే అత్యాచారాలకు పాల్పడుతున్నారని... వారిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ క్రిమినల్స్ రెచ్చిపోతుంటే ఫాంహౌస్‌లో రెస్టు తీసుకుంటున్న కేసీఆర్... దేశంలో పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ డ్రగ్స్ కేంద్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. అప్పుడప్పుడు లేచి... డ్రగ్స్ అంతు చూడాలని కబుర్లు చెప్పి మరో ఆరేడు నెలలు పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయాన్ని ఓ అధికారి కూడా తనకు చెప్పారన్నారు. మొదట్లో డ్రగ్స్ కనిపించకూడదని చెప్పిన సీఎం కేసీఆర్ కొన్ని రోజుల తర్వాత ఇదే తప్ప వేరే పనిలేదా అని ప్రశ్నించారని అన్నట్టు చెప్పారన్నారు.
దేశంలో గతంలో ఉగ్రవాదులు బాంబులు పెట్టేవాళ్లని ఇప్పుడు పెడుతున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ బలహీనుడని ఆయన పని అయిపోయిందన్నారు బండి సంజయ్. ఎప్పుడైనా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ర్యాలీలు తీశారా అని ప్రశ్నించారు. తెలంగాణలో చౌరస్తాలో గతంలో ఫ్లెక్సీలు ఎక్కడైనా కట్టారా అని నిలదీశారు. తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడా కట్టలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారన్నారు. కేసీఆర్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారని అందుకే ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే ర్యాలీలు తీయని కేసీఆర్... రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ర్యాలీలు తీస్తున్నారన్నారు. ఇక్కడే గతి లేని వ్యక్తి అన్ని పార్టీలకు పిలుపునిస్తున్నారని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిందని... అన్నారు బండి. ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. మోదీ వచ్చాక ఆర్టికల్ 370 రద్దు చేశారని... ట్రిపుల్ తలాఖ్ రద్దైందని.. అయోధ్య రామమందిరం కడుతున్నామన్నారు. రోడ్లు వేస్తున్నామని.. ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటైనా డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇచ్చిందాని అని ప్రశ్నించారు.
తెలంగాణలో రైతులు వ్యవసాయం చేసుకోవడం లేదన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన వ్యక్తి కేసీఆర్ ఆని విమర్శించారు సంజయ్. అకాల వర్షాలకు నష్టపోయిన రైతు కుటుంబానికి ఒక్కపైసా అయినా ఇచ్చారా అని నిలదీశారు. పంజాబ్‌లో ఇచ్చిన మూడు లక్షలు ఇచ్చిన వ్యక్తి ఇక్కడ రైతులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఇక్కడ ఆత్మహత్యలపై ఎందుకు స్పందించడం లేదన్నారు.
తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రావద్దని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. అందరం కలిసి తెలంగాణ సాధించుకుంటే.. కేసీఆర్ కుటుంబమే ఎందుకు రాజ్యమేలుతుందన్నారు. ఇక్కడ తెలంగాణ గురించి పట్టించుకోని వ్యక్తి దేశం కోసం ఏం చేస్తారన్నారు. తెలంగాణ రక్తం కేసీఆర్‌లో ప్రవహిస్తుంటే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని సవాల్ చేశారు. ముందు తెలంగాణలో మంత్రులు అటూ ఇటూ పోతున్నారు చూసుకోమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి బయటపెట్టాలన్నారు. ప్రశాంతంగా బతకనివ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అదే జరగడం లేదన్నారు. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని... ముందు ఆ పరిస్థిత మార్చుకోమని సూచించారు. మోదీ మరో ఇరవై ఏళ్లు పాలిస్తాడని.. మీ స్ట్రాటజిస్టే చెప్పారని అన్నారు.