Minister Talasani Srinivas : ముందస్తు ఎన్నికలు ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న రాజకీయ రాగం. కేంద్రంలో ఉన్న పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తోందని స్థానిక పార్టీలు ఆరోపిస్తుంటే లేదు లేదు స్థానిక పార్టీలే ఇలా చేస్తాయని జాతీయ పార్టీల నేతలు అంటున్నారు. ఇటీవల తెలంగాణలోనూ ఈ ముందస్తు రాగం వినిపించింది. తాజాగా మరోసారి ముందస్తు ఎన్నికలు వర్డ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. మీరు సై అంటే మేము సై అంటూ కౌంటర్ ఇచ్చారు. 


సై అంటే సై 


కేంద్రంలో ఉన్న మీరు ముందస్తు ఎన్నికలకు వెళితే మేము కూడా ముందస్తుకు సిద్ధమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తేల్చిచెప్పారు. మహారాష్ట్ర మాదిరి తెలంగాణలో చేస్తామని అంటున్న నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మీరు సై అంటే మేము సై అని స్పష్టం చేశారు. మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మంచిదని లేకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. ఎవరు ఎవరికీ భయపడరని బీజేపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన మంత్రి తలసాని మీడియాతో కాసేపు మాట్లాడారు. 


బై బై మోదీ ఫ్లెక్సీలు అందుకే 


బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు మంత్రి తలసాని స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా తాను వచ్చినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీ జరిగినప్పుడు కూడా ఫ్లెక్సీలకు జీహెచ్‌ఎంసీ ఫైన్‌ వేసిందన్నారు. మంత్రికి కూడా జరిమానా విధించారని స్పష్టం చేశారు. బీజేపీ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌పై ఒక డిజిటల్‌ ఫ్లెక్సీ పెట్టారన్న ఆయన ఆ తర్వాతే బై బై మోదీ అని ఫ్లెక్సీలు పెట్టారన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశం పేరుతో హైదరాబాద్‌కు టూరిస్టులు వచ్చారని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. 


ఇది శాంపిల్ మాత్రమే 


తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూసి తెలుసుకుని టూరిస్టులు వెళ్తారని మంత్రి తలసాని అన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కేవలం శాంపిల్ మాత్రమే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నేతలు అంటున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తే మేము సిద్ధమన్నారు. దమ్ముంటే ఎన్నికల్లో తలపడాలని తలసాని సవాల్‌ విసిరారు.